మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి

byసూర్య | Sat, Nov 02, 2024, 11:16 PM

 మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనపై వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం విషాదకరం. ఈ ఘటనతో.. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. శనివారం (నవంబర్ 02న) సాయంత్రం సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుంది. మనోహరాబాద్‌ మండలం పోతారం వద్ద.. ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ (వాటర్ ట్యాంకర్)ను బైకు ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది.


పోతారం గ్రామానికి చెందిన మన్నె ఆంజనేయులు.. తన మరదలు లత, ఆమె ఇద్దరు పిల్లలు సహస్ర, శాన్వితో కలిసి శభాష్ పల్లి వైపు ద్విచక్రవాహనంపై బయలు దేరారు. ఆంజనేయులు తన తమ్ముడి భార్య అయిన లతను, ఆమె పిల్లలిద్దరినీ బస్సు ఎక్కించేందుకని.. వెళ్తున్నాడు. అయితే.. రోడ్డుపై ఓవైపు రైతులు ధాన్యం ఆరబోయగా.. ఒకే వైపు నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఆంజనేయులు తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంకర్‌ను గమనించలేదా.. లేదా పక్కనుంచి వెళ్లిపోవచ్చు అనుకున్నాడో.. లేదా ట్రాక్టర్ డ్రైవర్ సైడ్ ఇస్తాడని అనుకున్నాడో.. మొత్తానికి అదే వేగంతో ముందుకు పోనిచ్చాడు. కానీ.. అక్కడ అలాంటివేమీ జరగలేదు. బైకు ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది.


ఈ ప్రమాదంతో.. లత, ఆమె ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆంజనేయులు తీవ్రంగా గాయపడగా.. స్థానికులు వెంటనే స్పందించి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన కూడా మృతి చెందాడు. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు చూసి.. స్థానికుల గుండెలు బరువెక్కాయి. కాసేపయితే.. బస్సు ఎక్కి హాయిగా ఇంటికి చేరుకోవాల్సిన ఆ తల్లీపిల్లలు, బస్సు ఎక్కించి తిరిగి ఇంటికి చేరుకోవాల్సిన ఆ కుటుంబ పెద్ద.. అనంతలోకాలకు వెళ్లిపోవటంతో ఆ కుటుంబంలో రోధనలు మిన్నంటాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందటంతో.. స్థానికులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.


సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే.. ప్రమాదం జరిగిన తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతదేహాలను తూప్రాన్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్థానికులతో మాట్లాడి సముదాయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. రైతులు రోడ్డుపై ధాన్యం ఆరబోయటంతో.. ఒకేవైపు నుంచి వాహనాలు రాకపోకలు జరుపుతున్నారని.. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలను అంచనా వేయలేకనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు.


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డి పై జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు Tue, Dec 10, 2024, 04:35 PM
ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొని యువకుడు మృతి Tue, Dec 10, 2024, 04:29 PM
నెలలో మూడున్నర కోట్ల విలువైన 1,100 ఫోన్లు రికవరీ Tue, Dec 10, 2024, 04:13 PM
సీసీ రోడ్లు వేయించమని వినతి పత్రం Tue, Dec 10, 2024, 04:12 PM
తెలుగు తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే Tue, Dec 10, 2024, 04:05 PM