byసూర్య | Sat, Nov 02, 2024, 09:38 PM
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. నిన్నటివరకు మిత్రులుగా ఉన్నవాళ్లు కూడా తెల్లారే సరికి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ శత్రువులుగా మారిపోతుండటం చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఇప్పుడు అచ్చంగా అదే జరిగింది తెలంగాణలో కూడా. మొన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం.. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ.. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేయని ఎంఐఎం నేతలు.. ఇప్పుడు మెల్లగా అది కూడా మొదలుపెట్టారు. బీఆర్ఎస్ పార్టీలపై ఏకంగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
శనివారం (నవంబర్ 02న) రోజున మీడియాతో మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ.. బీఆర్ఎస్ జాతకాలన్ని తమ దగ్గరున్నాయని.. అవన్ని చేప్తే వాళ్లు తట్టుకోలేరంటూ కీలక కామెంట్లు చేశారు. మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ ప్రణాళికలు చేయలేదా.. ఆ ప్రణాళిక వద్దని నేను చెప్పలేదా అంటు అసదుద్దీన్ ప్రశ్నించారు. అప్పటి విషయాలన్నీ ఇప్పుడు బయటపెట్టాలా అని అడిగిన అసదుద్దీన్.. తాను నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడతారంటూ హెచ్చరించారు. ఇళ్లు కదల్చకుండా మూసీ ప్రక్షాళన చేస్తే స్వాగతిస్తామని అసదుద్దీన్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలని సూచించారు.
బీఆర్ఎస్ పార్టీకి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ వల్లే ఎక్కువ సీట్లు వచ్చాయని అసదుద్దీన్ చెప్పుకొచ్చారు. ఎంఐఎం మద్దతుతోనే ఎక్కువ సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. 24 మంది అభ్యర్థులను మార్చి ఉంటే బీఆర్ఎస్ మళ్లీ గెలిచేదని తెలిపారు. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలకు చాలా అహంకారం ఉండేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ స్పందించారు. ఎక్కువ మంది సంతానం ఉండాలని చంద్రబాబుతో పాటు స్టాలిన్ కూడా అంటున్నారని గుర్తు చేసిన అసదుద్దీన్.. అదే విషయాన్ని తాను చెప్పి ఉంటే ఎక్కడలేని రచ్చ చేసేవారని చెప్పుకొచ్చారు. దక్షిణ భారత్ దేశంలో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారన్నారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి నష్టమేనని.. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గుతుందన్నారు. బాగా పనిచేసిన రాష్ట్రాలను ప్రోత్సహించకుండా శిక్షిస్తే ఏం లాభమని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.