ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే

byసూర్య | Sun, Sep 29, 2024, 11:24 PM

హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్న క్రమంలో.. పెరిగిపోతున్న జనాభాకు అనుగణంగా రవాణా వ్యవస్థను ప్రభుత్వాలు అంతకంతకూ మెరుగుపరుస్తూ వస్తున్నాయి. ఎంత మెరుగుపరిచినా.. ట్రాఫిక్ కష్టాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. అయితే.. ఈ ట్రాఫిక్ సమస్య కేవలం నగరంలోపలే కాదు.. నగర శివారుల్లోనూ ఉండటం గమనార్హం. ఎందుకంటే.. శివారు ప్రాంతాలు కూడా అంతకంతకూ అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రాంతాల్లో పటాన్‌చెరు- సంగారెడ్డి కారిడార్‌ కూడా ఉంది. ఈ మార్గంలో.. రియల్ ఎస్టేట్‌ జహీరాబాద్‌ వరకు విస్తరించటంతో.. ట్రాఫిక్ సమస్య ఇక్కడ కూడా మొదలైంది. దీంతో.. రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు ఇలా రకరకాల మార్గాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.


ముఖ్యంగా.. మియాపూర్‌ నుంచి పటాన్‌ చెరు వరకు పెద్దపెద్దగా షాపింగ్‌ మాల్స్‌ అందుబాటులోకి రావడంతో పాటు ఐటీ కారిడార్‌కు కూడా లింక్‌ ఉండడంతో ఈ ప్రాంతంలో రోజు రోజుకు ట్రాఫిక్‌ సమస్య పెరిగిపోతోంది. ఫలితంగా.. మియాపూర్ మీదుగా సంగారెడ్డి వెళ్తున్న వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పటం లేదు. అయితే.. ఈ మార్గంలో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు.. అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలోనే మియాపూర్ నుంచి సంగారెడ్డి కూడలి (పోతిరెడ్డిపల్లి చౌరస్తా) వరకు ప్రస్తుతం 4 వరుసలుగా ఉన్న రోడ్డును 6 వరుసలుగా 60 మీటర్లకు విస్తరించే పనులను ప్రారంభించారు.


31 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డు విస్తరణకు 1400 కోట్ల రూపాయలు ఖర్చవనుంది. అయితే.. ఇందులో రోడ్డు నిర్మాణ పనులకు వెయ్యి కోట్లు ఖర్చవుతుండగా.. భూసేకరణ పరిహారానికి 400 కోట్లు ఖర్చు కానున్నట్టు అధికారులు తెలిపారు. అయితే.. ఇప్పుడు విస్తరణ చేస్తున్న 60 మీటర్లతో పాటు సర్వీసు రోడ్డు కలుపుకుంటే మొత్తం 200 మీటర్లు కానుంది. దీంతో.. హైదరాబాద్ నగరంలో విశాలంగా ఉన్న ప్రధాన రహదారి ఇదే కానుంది. మరోవైపు ఈ రోడ్డులో వాహనాలకు క్రాసింగ్‌ రోడ్లతో ఇబ్బంది లేకుండా కొన్ని చోట్ల ఫ్లైఓవర్లను కూడా నిర్మించనుండటం గమనార్హం. బీహెచ్‌ఈఎల్‌తో పాటు పటాన్‌చెరు, ఇస్నాపూర్, ముత్తంగి, రుద్రా­రం, కంది ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మించనున్నట్టు తెలుస్తోంది.


ఈ రోడ్డు విస్తరణ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. నగరంలో ప్రస్తుతం రోడ్డు విస్తరణకు వీలుగా రోడ్డు పక్కన 60 మీటర్ల స్థలం చాలావరకు అందుబాటులో ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు తీసేయాల్సి ఉంది. అయితే.. బీహెచ్‌ఈఎల్‌ దాటిన తర్వాత మాత్రం చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు ఉండటంతో వాటిని తొలగించటం ఇప్పుడు అధికారులకు పెద్ద టాస్క్‌గా మారింది.



Latest News
 

ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM
హైదరాబాద్‌లో షాకిస్తోన్న ఇళ్ల ధరలు.. 32 శాతం జంప్.. చదరపు అడుగు ఎంతంటే? Sun, Sep 29, 2024, 11:28 PM
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు Sun, Sep 29, 2024, 11:26 PM
ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే Sun, Sep 29, 2024, 11:24 PM