హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా

byసూర్య | Fri, Sep 27, 2024, 09:04 PM

ప్రస్తుత రోజుల్లో సినిమా అంటే.. కేవలం ఒక ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాదు.. అదొక ఎమోషన్‌లా మారిపోయింది. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచటమే కాకుండా.. ఏదైనా ఓ సున్నితమైన సందేశాన్ని సమాజానికి అందించే ప్రధాన సాధనంగా సినిమా రూపాంతరం చెందింది. ఒక సామాన్యున్ని సెలెబ్రిటీలా మార్చే సినిమాను ప్యాషన్‌గా ఎంచుకుని.. ఎన్నో లక్షల మంది యువత తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. అందులో చాలా మంది అవకాశాలు దొరక్క కష్టాలు పడుతుంటే.. మరికొందరు మాత్రం అవకాశాలు దొరికినా లైమ్ లైట్‌లోకి రాలేక ఇబ్బందులు పడుతున్నారు.


అయితే.. ఏ పనిలో అయినా పనసపండంత కష్టానికి తోడు అవగింజంత అదృష్టం తోడైతేనే.. విజయం సాధించొచ్చన్న మాట సినిమా వాళ్లకు సరిగ్గా సరిపోతుంది. అలా.. కొంత మంది స్టార్లుగా ఎదుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే.. తెలంగాణలోని కరీంనగర్ కుర్రాడు ఇటు టాలీవుడ్‌లోనో.. అటు బాలీవుడ్‌లోనో కాదు.. ఏకంగా హాలీవుడ్‌లోనే జెండా పాతేస్తున్నాడు. కేవలం 14 రోజుల్లోనే సినిమా తీయటమే కాకుండా.. కేవలటం ట్రైలర్‌తోనే 28 ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు మన కరీంనగర్ బిడ్డ.


కరీంనగర్‌ భగత్‌నగర్‌లోని శ్రీరామకాలనీకి చెందిన గుండ వెంకట్‌సాయి హాలీవుడ్‌లో సత్తా చాటుతున్నాడు. మనసులో గట్టిగా అనుకోవాలే గాని.. సాధించలేనిది ఏదీ లేదు.. అని వెంకట్ సాయి మరోసారి నిరూపించాడు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే.. తన ప్యాషన్ అయిన నటనలోనూ సత్తా చాటుతున్నాడు. తనకు నటనపై ఉన్న మక్కువతో కష్టపడి.. 31 ఏళ్ల వయసులోనే ఏకంగా హాలీవుడ్‌లో సినిమా నిర్మించాడు. సినిమా తీయటమే కాదు.. కేవలం ట్రైలర్‌తోనే 28 ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు సాధించి.. హలీవుడ్ గడ్డ మీద కరీంనగర్ బిడ్డ మీసం మెలేశాడు.


వెంకట్‌సాయి ఇంజనీరింగ్ తర్వూత.. ఎంఎస్ కోసం 11 ఏళ్ల కిందట ఆమెరికాకు వెళ్లాడు. చదువు తర్వాత అక్కడే ఉద్యోగం తెచ్చుకుని.. పెళ్లి చేసుకుని తన భార్య ప్రత్యూషతో కలిసి న్యూజెర్సీలోనే స్థిరపడ్డాడు. వెంకట్ సాయికి మొదటి నుంచి ఫొటోగ్రఫీ, యాక్టింగ్ మీద చాలా ఆసక్తి. ఆయన పేరెంట్స్.. గుండ సునీత, శ్రీనివాస్‌ కూడా వెంకట్ సాయిని ప్రోత్సహించారు. దీంతో.. అమెరికాలో ఆరంకెల శాలరీ వస్తున్నప్పటికీ.. వెంకట్‌ సాయి మాత్రం ఫొటోగ్రఫీ, యాక్టింగ్‌ను మాత్రం ఎక్కడా వదల్లేదు.


ఎప్పటికైనా హాలీవుడ్‌లో సినిమా తీసి.. తెలుగోడి సత్తా చాటాలన్న లక్ష్యంతో.. కష్టపడ్డాడు. అటు ఉద్యోగం చేస్తూనే.. సమయం దొరికినప్పడల్లా.. ఓ వెబ్‌ సిరీస్ తీశాడు. "వద్దంటే వస్తావే ప్రేమ" పేరుతో 10 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ తీసి.. ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఈ వెబ్ సిరీస్‌కు బెస్ట్‌ ఫొటోగ్రాఫర్‌గా అవార్డులు కూడా పొందడం విశేషం.


ఆ వెబ్ సిరీస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో.. తప్పుచేసి పశ్చాత్తాపడే స్టోరీ లైన్‌తో.. హార్రర్, థ్రిల్లర్, సైకాలజికల్ కోవాలో "ది డిజర్వింగ్" సినిమాను తీశాడు వెంకట్ సాయి. హార్రర్, థ్రిల్లర్, సైకాలజికల్ ఎంటర్ టైనర్‌‍గా తెరకెక్కించిన ఈ సినిమాలో.. స్టోరీకి తగ్గట్టుగా ఉండే అమెరికన్ నటీనటులను ఆడిషన్స్‌ నిర్వహించి సెలెక్ట్ చేసుకున్నాడు. గంట 17 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాను కేవలం 14 రోజుల్లోనే తీయటం మరో స్పెషాలిటీ.


సాయిసుకుమార్, అరోరా(డైరెక్టర్‌), ఇస్మాయిల్, సీమోన్‌స్టార్లర్, కేసీస్టార్లర్, ప్రియ(మోడల్‌), మారియంలు సినిమా నిర్మాణంలో చాలా సహకరించినట్టుగా వెంకట్‌ సాయి తెలిపాడు. ఈ సినిమా అక్టోబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా 128 దేశాల్లో విడుదల కానుందని తెలిపాడు. కథ రాయటం నుంచి సినిమా పూర్తయ్యే వరకు సుమారు ఐదేళ్ల పాటు చాలా కష్టపడ్డానని తెలిపాడు. తెలుగు వ్యక్తిగా త్వరలోనే టాలీవుడ్‌లో నటిస్తానని కూడా చెప్పుకొచ్చాడు వెంకట్ సాయి.


తన కొడుకు వెంకట్‌సాయికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి అని... ఎక్కువగా ఇంగ్లీష్‌ సినిమాలో చూసేవాడని తల్లిదండ్రులు చెప్తున్నారు. కెమెరా పట్టుకొని, ఫొటోలు తీస్తూ తన సరదా తీర్చుకునేవాడని.. తాము కూడా ఏనాడూ తన ఇష్టాలను కాదనలేదని తెలిపారు. అమెరికా వెళ్తానంటే పంపించామని... అక్కడ ఉద్యోగం చేస్తూనే ప్రపంచం గుర్తించే స్థాయిలో సినిమా తీస్తాడని కలలో కూడా ఊహించలేదని తల్లిదండ్రులు గర్వపడుతున్నారు.


Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM