రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్

byసూర్య | Fri, Sep 27, 2024, 03:05 PM

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ జరిగే వరకు తాను నిద్రపోనని, సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనీయనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఎనుముల రేవంత్ రెడ్డి అంటే ఎగవేతల రేవంత్ రెడ్డిగా మారారని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో హరీశ్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ హయాంలో నాట్ల సమయంలో రైతుబంధు ఇస్తే, పంటలు కోతకు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. తాము పదేళ్ల పాటు రైతులకు ఇబ్బందులు లేకుండా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దొంగరాత్రి కరెంట్ ఇస్తోందని విమర్శించారు. కరోనా సమయంలో కూడా రైతు బంధు ఇచ్చి ఆదుకున్నామన్నారు.రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతుంటే, చేతలు గడప కూడా దాటడం లేదని విమర్శించారు. రైతుబంధు ఇవ్వకుండా రైతులను అప్పులపాలు చేస్తున్నారని ఆరోపించారు. కుంటిసాకులు, అబద్ధాలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. 11 సార్లు కేసీఆర్ సమయానికి రైతుబంధు ఇచ్చాడని, వడ్లు కొనుగోలు చేసి మూడు రోజుల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో వేశారని తెలిపారు. తద్వారా రైతు విలువను, భూమి విలువను కేసీఆర్ పెంచాడన్నారు. కాంగ్రెస్ వచ్చాక రైతు విలువ, భూమి విలువ తగ్గిందన్నారు.కాళేశ్వరం కూలిపోయిందని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులోని వంద భాగాల్లోని ఒక్క భాగానికి సంబంధించి రెండు పిల్లర్లు కూలితే కాళేశ్వరమే కూలిపోయినట్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లకు బోనస్ అని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పుడు సన్నాలకేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు.రైతు రుణమాఫీపై తొలి సంతకమని చెప్పిన కాంగ్రెస్, దానిని అమలు చేయలేదని విమర్శించారు. రుణమాఫీ పూర్తిగా చేస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశానని, రైతులకు మేలు జరగడం కంటే తనకు ఎమ్మెల్యే పదవి ఎక్కువ కాదన్నారు. రుణమాఫీకి ఆగస్ట్ 15 గడువు అన్నారని, కానీ చేయలేదన్నారు. రుణమాఫీ మొత్తం రూ.31 కోట్ల నుంచి రూ.18 కోట్లకు పడిపోయిందన్నారు. రుణమాఫీ అయింది తక్కువ.. కానోళ్లే ఎక్కువ అన్నారు.


Latest News
 

హైదరాబాద్‌లో అవన్నీ బ్యాన్.. ఆమ్రపాలి సంచలన నిర్ణయం Fri, Sep 27, 2024, 07:43 PM
అక్టోబరు 31 వరకు ఆ మార్గాల్లో 12 రైళ్లు రద్దు Fri, Sep 27, 2024, 07:42 PM
హైదరాబాద్ టు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్.. ఇక రాత్రిళ్లు రయ్యంటూ దూసుకెళ్లొచ్చు Fri, Sep 27, 2024, 07:36 PM
తెలంగాణలో మరో 10 కొత్త డిపోలు.. ఆర్టీసీ కీలక నిర్ణయం Fri, Sep 27, 2024, 07:33 PM
హైదరాబాద్‌లో కలకలం.. 15 చోట్ల ఈడీ సోదాలు.. ఆ ఇద్దరు మంత్రులే టార్గెట్! Fri, Sep 27, 2024, 07:29 PM