byసూర్య | Wed, Sep 18, 2024, 08:18 PM
వినాయక చవితి ఉత్సవాలు అంటేనే మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ప్రతి ఏడాది ముస్లింలో వినాయక చవితి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ ఏడాది కూడా తొమ్మిది రోజులు పాటు హిందువులతో సమానంగా ముస్లింలు కూడా వినాయకుడికి పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఇక కొన్ని చోట్ల అయితే గణేషుడు లడ్డూ వేలంలోనూ పాల్గొని మహా ప్రసాదాన్ని దక్కించుకున్నారు. హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసుంటారని నిరూపించారు.
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం భట్పల్లి గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర గణేశ్ మండలి ఆధ్వర్యంలో వినాయకుడి మండపం ఏర్పాటు చేశారు. 11 రోజుల పూజల అనంతరం వినాయకుడి లడ్డూ వేలం వేయగా.. చాలా మంది ఉత్సాహంగా వేలంలో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన అఫ్జల్- ముస్కాన్ దంపతులు సైతం వేలంలో పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన వేలంలో రూ.13,216కు అఫ్జల్ దంపతులు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారిని ఘనంగా సత్కరించారు.
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన అఫ్జల్ దంపతులను పలువురు అభినందించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ దంపతులను అభినందిస్తూ ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ‘గంగా జమునా తహజీబ్’ అంటూ ప్రశంసించారు. అసలైన తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టారని ముస్లిం దంపతులను కేటీఆర్ కొనియాడారు. ఈ మత సామరస్యం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
ఇక ఖమ్మం మండలం ఆరెంపుల గ్రామంలోనూ వినాయకుడి లడ్డూ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. నవరాత్రుల అనంతరం గ్రామంలోని వినాయకుడి లడ్డూ వేలంగా వేయగా.. గ్రామానికే చెందిన ముస్లిం దంపతులు దాదా సాహెబ్, షమీ వేలంలో పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన వేలంలో చివరకు లడ్డూను రూ. 23,500కు సాహెబ్ దంపతులు దక్కించుకున్నారు. వేలంలో లడ్డూను దక్కించుకొని మతసారస్యాన్ని చాటారు. హిందూ ముస్లిం అనే బేధాలు లేవని చాటి చెప్పేందుకే తాను వేలంలో పాల్గొన్నట్లు సాహెబ్ వెల్లడించారు. ఇలా పలు చోట్ల లడ్డూ వేలంలో పాల్గొన్న ముస్లింలు మత సామరస్యాన్ని చాటి చెప్పారు.