ఈ విషాదం ఎవ‌రి పాపం?: కేటీఆర్

byసూర్య | Wed, Sep 18, 2024, 08:16 PM

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో నెల రోజుల వ్యవధిలోనే 48 మంది పసి పిల్లలు, 14 మంది బాలింతలు మృతి చెందినట్లు ఓ రిపోర్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఒక్క ఆగస్టు నెలలోనే గర్భంతో ఉన్న 14 మంది మహిళలు, 48 మంది నవజాత శిశువులు చనిపోయినట్లు ఆ రిపోర్టులో వెల్లడైంది. ఈ విషయం బయటికి పొక్కకుండా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి.


ఈ నేపథ్యంలో పసిపిల్లల మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ స్పందించారు. ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ ఆసుప‌త్రిలో ఇంతటి విషాదం ఎవ‌రి పాపమని ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఆ పసిబిడ్డల ప్రాణాల‌కు విలువ లేదా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ త‌ల్లుల గర్భశోకానికి జ‌వాబు ఉండదా? అని ప్రశ్నించారు. ఏ తప్పూ చేయకపోతే ప్రభుత్వం ఈ లెక్కలను ఎందుకు దాస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.


'48 మంది ప‌సి గుడ్డులు.. 14 మంది బాలింత త‌ల్లులు.. ఊహించుకుంటేనే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తోంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ? వ్యవస్థలు ప‌నిచేస్తున్నాయా ? ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ ఆసుప‌త్రిలో ఇంత విషాదం ఎవ‌రి పాపం ? ఆ పసిబిడ్డల ప్రాణాల‌కు విలువ లేదా? ఆ త‌ల్లుల గర్భశోకానికి జ‌వాబు ఉండదా ? త‌ప్పు చేయ‌క‌పోతే స‌ర్కారు ఈ లెక్కలను ఎందుకు దాస్తోంది... ఎందుకు భ‌య‌ప‌డుతోంది... ఆ తల్లీబిడ్డల ఉసురు మీకు త‌గ‌ల‌దా..? ఒక్క గాంధీలోనే ఇన్ని మ‌ర‌ణాలుంటే.. రాష్ట్రంలో ప‌రిస్థితి ఏంటని ఆలోచిస్తేనే భ‌యంగా ఉంది.


గ‌ర్భిణీల‌కు న్యూట్రిష‌న్ కిట్లు, డెలివ‌రీ అయితే కేసీఆర్ కిట్లు, సిజేరియ‌న్ కాకుండా నార్మల్ డెలివరీల‌కు ప్రాధాన్యతనిస్తూ.. తల్లీబిడ్డలను ఇంటి దగ్గర దిగ‌బెట్టి వ‌చ్చేలా కేసీఆర్ వ్యవస్థలను త‌యారు చేశారు. అది ఓ పాల‌కుడిగా ప్రజల బాధ్యతలను తీసుకోవ‌టం. మ‌రీ మ‌న చీప్ మినిస్టర్ ఏం చేస్తున్నారో...? పాల‌న గాలికి వ‌దిలి ప్రచార ఆర్భాటాలు, విగ్రహ రాజ‌కీయాలు చేస్తే ఇలాగే ఉంట‌ది.' అని కేటీఆర్ ఘాటుగా ట్వీట్ చేశారు.


గాంధీ హస్పిటల్‌లో పెరిగిన మాతా, శిశుమరణాలపై అధికార వర్గాల్లో టెన్షన్ మెుదలైంది. ఆగస్టు నెల ప్రసవాల రిపోర్ట్‌ బయటకు రావడంపై గాంధీ సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక ఆసుపత్రిలో స్పెషలిస్టులైన డాక్టర్లు బదిలీలు కావటమే ఘటనలకు కారణంగా తెలుస్తోంది. సంతాన సాఫల్య కేంద్రం మూసివేయటం, మందులు కొరత, అత్యవసర సేవలు అందించటంలో నిర్లక్ష్యం కారణాలుగా భావిస్తున్నారు. చర్చనీయాంశమైన మాతా, శిశు మరణాలపైన ఉన్నతాధికారులు రివ్యూ చేస్తున్నట్లు తెలిసింది.



Latest News
 

సీఎంను కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు Thu, Oct 10, 2024, 03:09 PM
నారాయణపేటలో మోస్తరు వర్షం Thu, Oct 10, 2024, 03:05 PM
జడ్చర్లలో ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో బీజేపీ మెంబర్‌షిప్ డ్రైవ్ Thu, Oct 10, 2024, 03:04 PM
నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ Thu, Oct 10, 2024, 02:56 PM
క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాముడు Thu, Oct 10, 2024, 02:53 PM