కుమార్తెను స్కూల్‌లో దింపి వస్తూ.. తల్లి దుర్మరణం

byసూర్య | Wed, Sep 18, 2024, 07:42 PM

స్కూల్ బస్సు ఒక్క నిమిషం ముందు వెళ్లిపోయింది. దీంతో కుమార్తెను పాఠశాలలో దింపేందుకు స్కూటీపై బయల్దేరింది. కూతుర్ని పాఠశాలలో సురక్షితంగా దింపేసి, ఇంటికి తిరిగెళ్తుండగా.. లారీ రూపంలో ఆ మహిళను మృత్యువు కబళించింది. హైదరాబాద్‌లోని నాచారంలో బుధవారం (సెప్టెంబర్ 18) ఉదయం 8.15 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అక్కను స్కూల్లో దింపేసి తన తల్లి వస్తుందని బాలుడు ఆశగా ఎదురుచూస్తుండగా.. తన తల్లి మృతదేహం ఇంటికి తిరిగొచ్చింది. పాఠశాల నుంచి తిరిగొచ్చిన బాలిక.. తన తల్లి ఇకలేదని తెలిసి రోదించిన తీరు అందరినీ కలచివేసింది.


నల్లకుంటలో నివాసం ఉండే సందిరి నీతా (38) అనే మహిళ నాచారంలో హెచ్‌ఎంటీ కూడలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. స్కూల్ బస్సు వెళ్లిపోవడంతో నీతా తన కుమార్తెను స్కూటీపై తీసుకొని బయల్దేరారు. నాచారంలోని జాన్సన్ గ్రామర్ స్కూల్‌లో తన కుమార్తెను వదిలేసింది. తిరిగి వస్తుండగా.. హెచ్ఎంటీ నగర్ కమాన్ వద్ద గ్యాస్ సిలిండర్ల లోడుతో వస్తున్న ట్రక్కు.. నీతా నడుపుతున్న స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన నీతాపైనుంచి లారీ చక్రం దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.


ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న నాచారం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నరేష్‌ (32)ను అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.


Latest News
 

మన గ్రోమోర్ సేవలను సద్వినియోగం చేసుకోండి Fri, Apr 18, 2025, 04:28 PM
ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరగాలి Fri, Apr 18, 2025, 04:25 PM
భగవాన్ బుద్ధుని జయంతి పోస్టర్ లు ఆవిష్కరణ Fri, Apr 18, 2025, 04:23 PM
మే 20న జాతీయ సమ్మె Fri, Apr 18, 2025, 04:20 PM
నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే చట్ట పరమైన చర్యలు Fri, Apr 18, 2025, 04:18 PM