byసూర్య | Tue, Aug 13, 2024, 09:39 PM
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం మెట్రో ప్రధాన రవాణా సాధనంగా మారింది. తక్కువ ఖర్చుతో అత్యంత వేగంగా నగరం ఓ మూల నుంచి మరో మూలకు చేరుకునేందుకు చాలా మంది మెట్రో ట్రైన్లను ఆశ్రయిస్తున్నారు. మెట్రో ప్రారంభంలో నగర ప్రజల నుంచి ఆశించినంతగా.. స్పందన రాకపోయినా ప్రస్తుతం రోజుకు దాదాపుగా 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గ్ కారిడార్‌లో మెట్రో పరుగులు పెడుతోంది. ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో మెట్రో విస్తరణకు ప్రభుత్వం సిద్దమైంది.
నగరంలోని పలు కొత్త మార్గాల్లో మెట్రోను ప్రతిపాదించారు. అందులో శంషాబాద్ విమానాశ్రయం మెట్రో ఒకటి. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు ఈ మెట్రోను ప్రతిపాదించారు. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు ప్రస్తుతం మెట్రో రైలు మార్గం ఉంది. ఈ మార్గాన్ని ఎల్బీనగర్- చాంద్రాయణగుట్ట- మైలార్‌దేవ్‌పల్లి- జల్‌పల్లి- పీ7 రోడ్- శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెుత్తంగా 33.1 కి.మీ. మేరకు పొడిగించనున్నారు. అయితే ఈ మెట్రో మార్గానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో పరుగులు పెడుతున్న మెట్రో మార్గాలు అన్నీ కూడా ఆకాశ(ఎలివేటెడ్) మార్గాలే. కానీ ఎయిర్ పోర్ట్ మెట్రో కారిడార్ మాత్రం ఆకాశమార్గంతో పాటు భూమిపై కొంత, భూగర్భం (టన్నెల్)లో మరికొంత దూరం నిర్మించేలా డీపీఆర్ డిజైన్ చేశారు. ఇలా భూమిపై మెట్రో పరుగులు పెట్టనుండటం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ప్రాజెక్ట్ డిజైన్ పరిశీలిస్తే.. నాగోల్ నుంచి లక్ష్మీగూడ వరకు మెుత్తం 21.4 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ (ఆకాశమార్గం) ఉంటుంది.
లక్ష్మీగూడ నుంచి పీ7 రోడ్డు ఎయిర్‌పోర్టు ప్రాంగణం సరిహద్దు వరకు 5.28 కి.మీ దూరం భూ మార్గాన్ని (ఎట్ గ్రేడ్) అధికారులు ప్రతిపాదించారు. ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం తగ్గేందుకు మెట్రోను భూమార్గంలో నిర్మించేందుకు డీపీఆర్ డిజైన్ చేయాలని సీఎం రేవంత్ ఆదేశించగా.. ప్రాథమిక అధ్యయనం అనంతరం స్వల్పదూరం ఎట్ గ్రేడ్ మర్గాన్ని డీపీఆర్‌లో పొందుపరిచారు.
ఇక ఎయిర్‌పోర్ట్ ప్రాంగణ సరిహద్దు నుంచి టెర్మినల్ వరకు 6.42 కి.మీ దూరం భూగర్భంలో (టన్నెల్) మెట్రో ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. ఇది హైదరాబాద్ నగరంలోనే తొలి భూగర్భ మార్గం కానుంది. ఇక్కడ మూడు స్టేషన్లు కార్గో, టెర్మినల్, ఏరోసిటీ నిర్మించనున్నారు. ఇక్కడ మెట్రో డిపో నిర్మించాలని కూడా ప్రతిపాదించారు.
నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు సగటున ప్రతి 1.5 కి.మీ దూరానికి ఒకటి చొప్పున మొత్తం 22 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో కొన్నింటిని ఫ్యూచర్ స్టేషన్లుగా భవిష్యత్తు అవసరాల కోసం మెట్రో అధికారులు ప్రతిపాదించారు. నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లో మెట్రో ఇంటర్-ఛేంజ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సిద్ధమైన డీపీఆర్‌లో అవసరమైతే మార్పులు చేర్పులు చేయనున్నట్లు మెట్రో అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి.