byసూర్య | Tue, Aug 13, 2024, 09:22 PM
మూసీ నది ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గాను.. ప్రస్తుతం మురుగు నీరు పారుతున్న మూసీనదిని అందంగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించింది. ఇప్పటికే బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయిచింది. మూసీ నదికి ఇరువైపులా అందమైన పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించి టూరిస్ట్‌గా హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నది ప్రక్షాళనకు సౌత్ కొరియా రాజధాని సియోల్ నగరం గుండా వెళ్లే అందమైన చియోంగీచియాన్ నదిని ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తున్నారు.
ఒకప్పుడు మూసీ మాదిరిగా మురికి కూపంగా ఉన్న ఆ నదిని.. అక్కడి ప్రభుత్వం పునరుద్ధరించి అందంగా తీర్చిదిద్దింది. దాదాపు 11 కిలోమీటర్ల ఈ నది విపరీతమైన కలుషితాలతో ఉండేది. ఈ నదిని 2005 నాటి నుంచి పునరుద్ధరణ పనులతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రివర్ ఫ్రంట్‌గా తీర్చిదిద్దన తర్వాత సియోల్ నగరవాసులే కాకుడా ప్రపంచం నలుమూలల నుంచి ఏటా దాదాపు 19 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. దీంతో సియోల్ నగరం ప్రముఖ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారింది.
మూసీ నదిని కూడా ఆ విధంగా తయారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా సౌత్ కొరియా రాజధాని సియోల్ నగరం నడిబొడ్డున ప్రవహించే చియోంగీచియాన్ నదీ పరిసరాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ప్రతినిధి బృందం పరిశీలించారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి సియోల్‌లోని నదిని పరిశీలించి ప్రపంచస్థాయి వాటర్ ఫ్రంట్‌గా తీర్చిదిద్దిన తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నది సుందరీకరణ జరిగిన తీరుతెన్నులను గమనించిన తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై అనేక ఆలోచనలకు అవకాశం ఇచ్చిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
కాగా, మూసీ నది తరహాలోనే చియోంగీచియాన్ నదికి కూడా ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ నది క్రమక్రమంగా మూసీ నది మాదిరిగానే మురికి కూపంగా మారింది. నగర సుందరీకరణలో భాగంగా పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆకర్షించేందుకు నదిని పునరుద్ధరించాలని 2003లో అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటికే ఉన్న భారీ రహదారిని ధ్వంసం చేసి.. రెండేళ్ల వ్యవధిలోనే దాదాపు 11 కి.మీ. మేర ఉన్న నదిని పునరుద్ధరించారు. ఇందుకు అప్పట్లోనే 281 మిలియన్ డాలర్ల ఖర్చయింది. నిర్మాణం పూర్తయ్యాక రోజుకు 1.20 లక్షల టన్నుల నీరు స్థానిక హాన్ నదీ నుంచి ఇందులోకి పంపింగ్ చేశారు. ఇలా మురికి కూపం నుంచి అద్భుత పర్యాటక ప్రాంతంగా చియోంగీచియాన్ నది రూపుదిద్దుకుంది.
2015లో ప్రధాని నరేంద్ర మోదీ , 2018లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ సత్యేంద్ర జైన్ తదితరులు ఈ నదిని పరిశీలించి.. ప్రక్షాళన గురించి వివరాలు తెలుసుకున్నారు. తాజాగా.. సీఎం రేవంత్ సైతం నదిని పరిశీలించి ఇదే తరహాలో మూసీని అభివృద్ది చేయాలని భావిస్తున్నారు.