byసూర్య | Fri, Aug 09, 2024, 09:46 PM
తెలంగాణలో ప్రమోషన్లు, బదిలీల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఇక వేచి చూసే బాధ తప్పనుంది. ఈ మేరకు ఏకంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ఉద్యోగుల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విద్యుత్ శాఖలో పదోన్నతులు, బదిలీలు చేపడతామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖలో గత 7, 8 ఏళ్లుగా ప్రమోషన్లు లేవని.. దీని వల్ల చాలా మంది విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం చెప్పారు.
హైదరాబాద్‌లోని టీజీఎస్పీడీసీఎల్‌పై విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు తమ ప్రమోషన్లు, బదిలీల గురించిన విషయాన్ని భట్టి విక్రమార్క ముందు ఉంచారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం.. ఈ విషయం సంబంధింత అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని.. కచ్చితంగా విద్యుత్ శాఖ ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలపై చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
మరోవైపు.. ప్రాజెక్టులలో లోపాల గురించి మాట్లాడిన డిప్యూటీ సీఎం.. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో తలెత్తిన లోపాలను కాంగ్రెస్ పైకి నెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరంతో పాటు సుంకిశాల కూలిన పాపం బీఆర్ఎస్‌దేనని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటన తమపై మోపేందుకు బీఆర్ఎస్ చూస్తోందని దుయ్యబట్టారు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో నిర్మించిన సుంకిశాల ప్రాజెక్టును 2021 జూలై 11 వ తేదీన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిందని.. గతేడాది జూలైలో టన్నెల్ సైడ్ వాల్ పనులు పూర్తి చేసినట్లు భట్టి విక్రమార్క వివరించారు. ఇన్నిరోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు మాత్రమే నాసిరకం అని అనుకున్నామని.. కానీ సుంకిశాల ఘటనతో వాళ్లు గోదావరినే కాదు కృష్ణ నదిని కూడా వదిలిపెట్టలేదని తేటతెల్లమైందని భట్టి విక్రమార్క ఆరోపించారు. సుంకిశాల ఘటనను తమ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో పాటు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సుంకిశాల ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించామని, దీనిపై విచారణ జరిపి దోషులను తేలుస్తామన్నారు.