byసూర్య | Fri, Aug 09, 2024, 09:27 PM
హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా, పరిపాలన దృష్ట్యా నగరాన్ని విస్తరించాలని సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏలో కొత్త జోన్లు ఏర్పాటు చేశారు. గతంలో నాలుగు జోన్లు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 6కు చేరుకుంది. ప్రస్తుతం ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న హెచ్‌ఎండీఏలో జోన్లను ఆరుకు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
శంషాబాద్, ఘట్‌కేసర్ జోన్లను యథాతథంగా ఉంచి.. శంకర్‌పల్లి, మేడ్చల్ జోన్లను రెండేసి జోన్లుగా విభజించనున్నారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ ప్రాంతం 7,200 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా.. త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్ మొత్తం హెచ్‌ఎండీఏ పరిధిలోకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. హెచ్‌ఎండీఏలో గతంలో నాలుగు జోన్లు ఉండగా.. నగరవాసులకు సేవలు అందించే విషయంలో ఇబ్బందులు తలెత్తేవి. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో అఫ్లికేషన్ల పరిశీలనలో తీవ్ర జాప్యం చోటు చేసుకునేది. తాజాగా.. జోన్లును విభజించడంతోపాటుగా అదనపు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
కాగా, హైడ్రా పరిధిని ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. విపత్తుల సమయంలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు హైడ్రాను విస్తరించనున్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన కార్యచరణ రూపొందించనున్నారు.
హెచ్‌ఎండీఏ జోన్లు.. విస్తరించిన ప్రాంతాలు
శంకర్‌పల్లి-1
రామచంద్రాపురం, చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, గండిపేట్, రాజేంద్రనగర్,
శంకర్‌పల్లి-2
సంగారెడ్డి, కంది, జిన్నారం, గుమ్మడిదల, హత్నూర్, అమీన్‌పూర్, పటాన్‌చెరు, శంకర్‌పల్లి,
మేడ్చల్-1
నర్సాపూర్, శామీర్‌పేట్, శివంపేట్, బాచుపల్లి, గుండ్లపోచంపల్లి, తుప్రాన్, మనోహరాబాద్
మేడ్చల్-2
ఉప్పల్‌భగాయత్, దుండిగల్, గండిమైసమ్మ, కొంపల్లి, మేడ్చల్, పీఎఫ్‌యూ, గ్రిడ్‌రోడ్, ములుగు, వర్గల్, కాప్రా
శంషాబాద్
మంచాల్(కొంత భాగం), మహేశ్వరం, శంషాబాద్, బాలాపూర్, ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూర్, ఫరూక్‌నగర్, షాద్‌నగర్, కొత్తూర్, నందిగామ
ఘట్‌కేసర్
అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, చౌటుప్పల్, ఘట్‌కేసర్, భువనగిరి, బొమ్మలరామారం, పోచంపల్లి, బీబీనగర్, మేడిపల్లి, కీసర