byసూర్య | Fri, Aug 09, 2024, 09:22 PM
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడి పురుషాంగాన్ని వీధి కుక్క కొరికివేసింది. నేడు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్ సబితా నగర్‌లో ఓ కుటుంబం గుడిసె వేసుకొని జీవనం సాగిస్తుంది. ఇవాళ ఉదయం గుడెసెలోకి ప్రవేశించిన వీధి కుక్క.. ఏడేళ్ల దివ్యాంగ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. బాలుడి పురుషాంగాన్ని సగానికి పైగా కొరికేసింది. ఈ ఘటనతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు బాలుడిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.
ఇక 20 రోజుల క్రితం వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాయపోల్ గ్రామానికి చెందిన శివ, మాధురి దంపతుల కుమారుడు క్రియాన్ష్ గౌడ్ అదే గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్నాడు. గత నెల 12న పాఠశాల ఆవరణలో బాలుడు ఆడుకుంటుండగా.. ఓ వీధి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో బాలుడు తీవ్రం గాయాపడ్డాడు.
దీంతో తల్లిదండ్రులు వెంటనే నారాయణగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ పరిస్థితి మెరుగుపడకపోవటంతో నీలోఫర్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. పరిస్థితి మెరుగుపడి డిశ్ఛార్జ్ అయ్యాడు. అయితే మూడ్రోజుల క్రితం బాలుడికి జ్వరం తీవ్రం కావటంతో కామినేని హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ రెండ్రోజుల చికిత్స అనంతరం మళ్లీ నీలోఫర్ ఆసుపత్రిలో జాయిన్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.