byసూర్య | Fri, Aug 09, 2024, 09:17 PM
నిషేదిత గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా తెలంగాణను మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోండగా.. అందుకు పోలీసులు ప్రత్యేకంగా బలగాలను ఏర్పాటు చేసి డ్రగ్ సరఫరా చేసే ముఠాలను పట్టుకుంటున్నారు. అయినా డ్రగ్స్, గంజాయి చాప కింద నీరులా రాష్ట్రంలో విస్తరిస్తూనే ఉంది. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది.
తాజాగా.. హైదరాబాద్ శివారులో సెక్యూరిటీ గార్డు ముసుగులో ఓ వ్యక్తి గంజాయి మెుక్కలు పెంచుతున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దాడులు చేసిన ఎక్సైజ్ పోలీసులు గంజాయి మెుక్కలను ధ్వంసం చేయటంతో పాటు సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో ఓ వ్యక్తి గంజాయి చెట్లను పెంచుతున్నాడనే సమాచారం ఎక్సైజ్ పోలీసులకు అందింది.
దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ పోలీసులు.. బిహారుకు చెందిన వికాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే వికాస్.. తాను నివసిస్తున్న ఇంటి సమీపంలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. ఏపుగా మెుక్కల్ని పెంచి గుట్టుగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొంత కాలంగా వికాస్ ఇదే దందా చేస్తున్నట్లు తెలిసింది. గంజాయి మొక్కలను ధ్వంసం చేసిన పోలీసులు.. వికాస్‌ను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.
800 కేజీల గంజాయి సీజ్ఇక ఐదు రోజుల క్రితం హైదరాబాద్ శివారులో భారీగా గంజాయి పట్టుబడింది. ఏకంగా 800 కేజీల గంజాయిని గుర్తించిన పోలీసులు ఐదురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఐదు రోజుల క్రితం శంషాబాద్ ఔటర్ రింగ్ పెద్ద గోల్కొండ సమీపంలో ఎస్ఓటి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ కంటైనర్‌ను పోలీసులు అడ్డగించి చెక్ చేశారు. అందులో 800 కేజీల గంజాయిని చూసి పోలీసులు షాక్ అయ్యారు. దీంతో కంటైనర్‌ను సీజ్ చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుడిన గంజాయి విలువ రూ. 3 కోట్ల పైనే ఉంటుందని పోలీసులు వెల్లడించారు.