byసూర్య | Fri, Aug 09, 2024, 07:50 PM
హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఇక నుంచి నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. రామోజీ ఫిల్మ్‌సిటీ మీదుగా నాలుగు ఆర్టీసీ (205 F) బస్సులను నేటి నుంచి నడపనున్నట్లు కాచిగూడ డిపో మేనేజర్ వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి ప్రతి అర గంటకు ఒక బస్సు చొప్పున ఈ బస్సులురాకపోకలు సాగిస్తాయన్నారు. రాత్రి 8.40 గంటలకు కాచిగూడ నుంచి చివరి బస్సు ఉంటుందన్నారు.
అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ప్రతిరోజు ఉదయం 7.10 గంటలకు బస్సు ఉంటుందని.. ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున రాత్రి 10 గంటల వరకు ఇక్కడి నుంచి బస్సులు నడుస్తాయన్నారు. ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు నల్గొండ చౌరస్తా, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, రామోజీ ఫిల్మ్‌సిటీ మీదుగా రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. ఈ అవకాశాన్ని బస్సు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.
త్వరలో సెమీ డీలక్స్ బస్సులు..
ఇక ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సీటీ ఆర్టీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో కాలు పెట్టే జాగా కూడా ఉండట్లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే సెమీ డీలక్స్ బస్సులను అందుబాటులోకీ తీసుకురావాలని యోచిస్తోంది.
తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 50 సెమీ డీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత.. విడతవారీగా బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ బస్సుల్లో మహిలక్ష్మీ పథకం వర్తించదు. మహిళలు అయినా సరే బస్సుల్లో టికెట్లు తీసుకోవాల్సిందేనని అధికారులు చెప్పారు. మినిమం టికెట్ ధర రూ. 30గా ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే కొత్త బస్సు అందుబాటులోకి వచ్చాక ధరల్లో హెచ్చు తగ్గులు ఉండే ఛాన్స్ ఉందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.