![]() |
![]() |
byసూర్య | Sun, Jul 21, 2024, 10:04 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం ఒడిశా, ఉత్తరాంధ్ర మీదగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు కూడా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణం కేంద్రం అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.
ముఖ్యంగా నేడు ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంటున్నారు. నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, మలుుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సిరిసిల్ల, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నారాయణపేట్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లా్ల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు హైదరాబాద్‌లోనూ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ప్రజలు అవసరం అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.
ఇక శనివారం రాష్ట్రమంతా ముసురు కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం అర్ధరాత్రి వరకు తేలికపాటి జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉన్న వాగులు పొంగిపొర్లుతున్నాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లెలో 13.2 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు, ఏటూరునాగారం వద్ద కూడా గోదావరి నది నీటిమట్టం పెరుగుతోంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఈ నదులు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.