ప్రమాదకర రసాయనాలు ఉపయోగించి తయారీ,,,నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

byసూర్య | Wed, Jun 07, 2023, 08:31 PM

ఏది నకిలీ.... ఏది ఆరోగ్యకరం అన్నది తేల్చుకోలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. హైదరాబాద్‌లో కల్తీ పదార్ధాల దందా జోరుగా సాగుతోంది. నకిలీ పదార్థాలను తయారుచేస్తున్న ముఠాలను ఇటీవల తరచుగా ఎక్కడో ఒకచోట పోలీసులు అరెస్ట్ చేస్తోన్నారు. నగరంలో కల్తీ పదార్థాలు తయారుచేసి మార్కెట్‌లో విక్రయిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దాడులు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇటీవల నకిలీ నిత్యావసర సరుకులు, తిండి పదార్థాలు తయారుచేస్తున్న స్థావరాలపై పోలీసులు ఆకస్మికంగా దాడులు చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.


ఈ క్రమంలో తాజాగా కల్తీ కేక్‌లు తయారు చేస్తున్న ముఠాపై ఎస్‌వోటీ బాలానగర్ పోలీసులు దాడులు చేపట్టారు. బాచుపల్లి పరిధిలోని నిజాంపేట్‌లోని బాలాజీ కేక్ ఫ్యాక్టరీలో కల్తీ కేక్‌లు తయారుచేస్తున్నారనే సమాచారంతో సోదాలు నిర్వహించారు. రసాయన రంగులు వాడి కేక్‌లు తయారుచేస్తున్నట్లు గుర్తించారు. అలాగే అపరిశుభ్ర వాతావరణంలో కేక్‌లు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. ఓనర్ గోపాల కృష్ణ పరారీలో ఉండగా.. అక్కడ పనిచేస్తున్న సయ్యద్ వాసిఫ్‌తో పాటు కేక్ మాస్టర్‌ను అరెస్ట్ చేశారు.


కాలం చెల్లిన క్రీములు, కుళ్లిపోయిన కేక్ తయారీకి సంబంధించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర రసాయనాలు ఉపయోగించి కేక్స్ తయారుచేస్తున్నారని, వీటిని ఇతర షాపులకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, లేబర్ లైసెన్స్ లేకుండానే కేక్ పరిశ్రమ నడుపుతున్నట్లు తేల్చారు. నిందితులను ఎస్ఓటీ పోలీసులు బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.


అటు మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ స్వీట్స్ తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. లాల్ దర్వాజ ప్రాంతంలోని ఓ ఇంట్లో నకిలీ స్వీట్స్ తయారుచేస్తున్నట్లు గుర్తించారు. కలకన్, అజ్మీరి కలకన్, ఖోవా లాంటి స్వీట్స్ నకిలీవి తయారుచేస్తున్నట్లు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం బాల్ గోపాల్ యోజన పథకం క్రింద ఉచితంగా ఇస్తున్న మిల్క్ పౌడర్‌ని అక్రమంగా తెలంగాణ రాష్ట్రానికి తరలించినట్లు బయటపడింది. ఈ పౌడర్‌ని కేక్‌ల తయారీ కోసం ఉపయోగిస్తున్నారు. దీంతో నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదకర రసాయనాలు ఉపయోగించి స్వీట్ తయారుచేస్తున్నారని, వీటికి బ్రాండెడ్ కవర్లు వేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.


నిందితులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఇటీవల నకిలీ ఐస్‌క్రీమ్స్ తయారుచేస్తున్నట్లు ముఠాను పట్టుకోగా.. ఇప్పుడు కేక్‌లు, స్వీట్స్ తయారుచేస్తున్నవారిని పట్టుకోవడంతో.. ఏది తినాలన్నా ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది.



Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM