![]() |
![]() |
byసూర్య | Sun, Feb 05, 2023, 08:19 PM
గౌతమ్ అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. దేశంలో సంచలనంగా మారిన అదానీ సంస్థల వ్యవహారంపై గులాబీ అధినేత కేసీఆర్ స్పందించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించిన బహిరంగ సభ అనంతరం ప్రెస్ మీట్‌లో పాల్గొన్న కేసీఆర్.. అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ భారీగా పెట్టుబడి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. సాధారణ వ్యాపారిగా ఉన్న అదానీ.. రెండేళ్లలోనే ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి ఎలా ఎదిగారంటూ నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీకి స్నేహితుడైన అదానీ అంత ఫాస్ట్‌గా ఎలా డెవలప్ అయ్యారంటూ ప్రశ్నలు సంధించారు. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని..ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లో కేంద్రం సమాధానం చెప్పి తీరాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీ లాభాల్లో కొనసాగుతుండగా.. ఎందుకు అమ్ముతున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నేతలంతా సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించాల్సింది పోయి.. కేవలం మాటలతోనే కాలం వెల్లదీస్తున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు.