బతుకమ్మ వేడుకల నేపథ్యం మీకోసం

byసూర్య | Sun, Sep 25, 2022, 10:42 AM

తెలంగాణ ప్రజలు ఎంతో వేడుకగా జరుపుకునే బతుకమ్మ వేడుకలు ఆదివారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది బతుకమ్మ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 9 రోజుల పాటు సాగే ఈ వేడుకలను రాష్ట్ర ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. రంగురంగుల పూలను గోపురంలా పేర్చి, వాటిపై గౌరమ్మను ఉంచి, చుట్టూ మహిళలు చేరి పాటలు పాడడం, 9వ రోజు వాటిని నిమజ్జనం చేయడం ఈ పండగలో భాగం. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపే పండుగ.

'బతుకమ్మ' అనే పదానికి 'మాతృ దేవత తిరిగి జీవం పోయండి' అని అర్థం ఉంది. తెలంగాణ ప్రాంతంలో ఇది 'జీవనోత్సవం'. పంట సమయంలో పంటలు సమృద్ధిగా పండినందుకు పార్వతీ దేవికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆరాధించడానికి ఇది జరుపుకుంటారు. వేడుకలలో ఆమె ఆశీర్వాదాలు కోరడం, తరువాతి సంవత్సరం కూడా సమృద్ధిగా పంటలు పండించమని ఆమెను కోరడం వంటివి ఉంటాయి. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా సంబరాలు జరుగుతాయి.

ఈ పండగకు చారిత్రక నేపథ్యం ఉంది. తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించే సమయంలో వేములవాడ చాళుక్యులు వారికి సామంతులుగా ఉండేవారు. రాష్ట్రకూటులకు, చోళులకు యుద్ధం జరిగిన సమయంలో రాష్ట్రకూటులకు చాళక్యులు మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో వేములవాడలో శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి, తంజావూరుకు చోళులు తరలించారు. ఇది తెలంగాణ ప్రజల హృదయాలను గాయపర్చింది. తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేసేలా పూలను పర్వత ఆకారంలో పేర్చి బతుకమ్మను నిర్వహించడం ప్రారంభించారు. శివుడు లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మను నిర్వహించడం అప్పటి నుంచి 1000 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. పండుగ యొక్క మూలం ఎలా ఉన్నా, ఇది ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా మహిళలకు గొప్ప ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగించే సమయం.


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM