స్త్రీ శక్తి అంటే ఏమిటో నిరూపించిన శిరీషా

byసూర్య | Sat, Aug 06, 2022, 03:57 AM

స్త్రీ శక్తి అంటే ఏమిటో నిరూపించింది శిరీషా. హైదరాబాదు శివారు హయత్‌నగర్‌కు చెందిన వివాహిత శిరీషను ఇప్పుడందరూ ‘శభాష్ శిరీష’ అని పొగుడుతున్నారు. కారణం ఆమె చూపించిన తెగువే. కళ్లలో కారం కొట్టి మెడలోని గొలుసును లాక్కుని పారిపోతున్న దొంగను మంటను భరిస్తూనే వెంటాడింది. కాళ్లకు గాయాలైనా లెక్కచేయకుండా వెంటాడి పట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లాకు చెందిన సండ్ర శిరీష-నగేష్ దంపతులు హయత్‌నగర్ సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకుంటున్నారు. వారు ఉంటున్న ఫ్లాట్ పక్కనే మరో రెండు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఖాళీగా ఉండడంతో అపార్ట్‌మెంట్ యజమాని భిక్షమయ్య టులెట్ బోర్డు తగిలించారు. 


భిక్షమయ్య కుమారుడు మధ్యప్రదేశ్‌లో ఉద్యోగం చేస్తుండడంతో ఇటీవల భిక్షమయ్య దంపతులు అక్కడికి వెళ్లారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ అపరిచిత వ్యక్తి నేరుగా ఇంటిపై అంతస్తుకు వెళ్లి శిరీషను కలిసి టులెట్ చూసి వచ్చానని చెప్పాడు. ఇంటి యజమాని లేరని తర్వాత రావాలని ఆమె చెప్పింది. అయితే, తాను ఇంటి యజమానితో ఫోన్లో మాట్లాడానని, ఇల్లు చూపించాలని చెప్పడంతో ఆమె సరేనని రెండు ఫ్లాట్‌లు చూపించింది. ఆ తర్వాత తాళం వేస్తున్న సమయంలో వెంట తెచ్చుకున్న కారాన్ని శిరీష కళ్లలో కొట్టిన నిందితుడు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కుని కిందికి దిగి పరుగులు పెట్టాడు. 


కంట్లో కారం పడడంతో విలవిల్లాడిపోయిన శిరీష బాధను భరిస్తూనే కిందికి పరుగులు పెట్టింది. అప్పటికే కిందికి చేరుకున్న నిందితుడు బైక్ స్టార్ట్ చేశాడు. మరొక్క క్షణమైతే మాయమయ్యేవాడే. శిరీష గబుక్కున బైక్ పట్టుకుంది. ఆమె వదలకపోవడంతో నిందితుడు బైక్‌ను ముందుకు పోనిచ్చాడు. అయినప్పటికీ పట్టువిడవని శిరీష కాళ్లకు గాయాలవుతున్నా సరే.. కేకలు వేస్తూనే బైక్‌ను గట్టిగా పట్టుకుంది. దాదాపు పదిమీటర్ల పాటు శిరీషను ఈడ్చుకెళ్లాడు. 


ఈ క్రమంలో అదుపు తప్పి నిందితుడు కిందపడ్డాడు. ఈలోపు చుట్టుపక్కల వారు వచ్చి నిందితుడిని పట్టుకుని చావబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని శిరీషకు అప్పగించారు. నిందితుడి నుంచి బైక్, కత్తితోపాటు దొంగతనం తర్వాత మార్చుకునేందుకు తెచ్చుకున్న చొక్కాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శిరీష తెగువను పోలీసులు ప్రశంసించారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM