విధ్వంసానికి ముందస్తు వ్యూహం...నివేదికలో పొందుపర్చిన పోలీసులు

byసూర్య | Tue, Jun 21, 2022, 02:19 PM

 


సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో చోటుచేసుకొన్న విధ్వంసం వెనక ముందస్తు వ్యూహం, కుట్రదాగివుందని పోలీసులు తమ రిపోర్ట్ లో నమోదు చేశారు. విధ్వంసం పథక తీరుపై  పోలీసులు  సమగ్ర నివేదిక తయారు చేసినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన సికింద్రాబాద్‌ అల్లర్ల కేసుకు సంబంధించి రిమాండ్‌ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి (ఏ-1)గా కామారెడ్డికి చెందిన మధుసూదన్‌ పేరును పోలీసులు చేర్చారు. ఈ మేరకు వాట్సాప్‌ గ్రూపుల్లో విద్యార్థులను మధుసూదన్‌ రెచ్చగొట్టి విధ్వంసానికి కుట్ర పన్నినట్లు తేల్చారు. అలాగే ఘటనలో ఇప్పటివరకు 56 మందిని రిమాండ్‌ రిపోర్టులో నిందితులుగా పేర్కొన్నారు. 12 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.


రిమాండ్ రిపోర్టులోని కీలక విషయాలను గమనించినట్లయితే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించాలనే కుట్రతోనే యువకులందరూ మూకుమ్మడిగా రైల్వే స్టేషన్లోకి చొచ్చుకొచ్చారు. లోకో ఇంజిన్లకు నిప్పుపెట్టాలని ఆందోళనకారులు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎంత నచ్చజెప్పినా వినలేదు. నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ లోకో ఇంజిన్ల వైపు వస్తుండటంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. లోకో ఇంజిన్‌లో 4వేల లీటర్ల హెచ్ఎస్‌డీ ఆయిల్ ఉంది. 3వేల లీటర్ల సామర్థ్యం ఉన్న లోకో ఇంజిన్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టి ఉంటే.. ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 20 రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో దామోదర్ రాకేష్ మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ఆందోళనకారులు రాళ్లు విసరడంతో చాలా మంది పోలీసు అధికారులు గాయపడ్డారు.


అగ్నిపథ్ కు వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ గ్రూప్, హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్ గ్రూప్, ఛలో సికింద్రాబాద్ ఏఆర్ఓ3 గ్రూప్, ఆర్మీ జీడీ2021 మార్చ్ ర్యాలీ గ్రూప్, సీఈఈ సోల్జర్ పేర్లతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసిన అభ్యర్థులు.. ఆ గ్రూపుల ద్వారా సికింద్రాబాద్ స్టేషన్లో విధ్వంసం చేయాలని ప్లాన్ చేశారు. అభ్యర్థులకు పలు ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. తమ ప్లాన్‌లో భాగంగా 17వ తేదీ ఉదయం 8.30 గంటలకు కలవాలని నిర్ణయించుకున్నారు. ఘటన రోజు ఉదయం స్టేషన్లోని ఫ్లాట్ ఫాం నెంబర్ 1, 3 నుంచి పెట్రోల్ బాటిళ్లు, కర్రలతో ప్రవేశించి.. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా అభ్యర్థులు నినాదాలు చేశారు.రైళ్ల అద్ధాలు ధ్వంసం చేయడంతోపాటు ప్లాట్ ఫాంపై ఉన్న స్టాళ్లను ధ్వంసం చేశారు. ఆ తర్వాత మూడు రైళ్లలోని నాలుగు బోగీలకు నిప్పుపెట్టారు. వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టి విధ్వంసానికి కుట్ర పన్నినట్లు తేలింది. ఆత్మరక్షణ కోసమే పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. బుల్లెట్ తగిలి రాకేష్ మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. దర్యాప్తులో ఉద్యోగార్థులను ప్రైవేట్ అకాడమీ వారే రెచ్చగొట్టినట్లు తేలిందన్నారు. బీహార్‌లో జరిగిన అల్లర్లను వాట్సాప్ గ్రూప్ లలో ప్రచారం చేశారని, స్టేషన్ కు వచ్చే సమయంలోనే పెట్రోల్ వెంట తేవాలని కొంతమంది సూచనలు చేశారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.


ఇదిలావుంటే ఈ అల్లర్లకు సంబంధించి 56 మందిని నిందితులుగా చేర్చి, వారిలో 46 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి రామండ్‌కు తరలించాం. ఈ కేసులో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన మధుసూదన్ ను ఏ1గా తేల్చాం. డిఫెన్స్ అకాడమీలకు చెందిన కొంతమంది నిర్వాహకులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు నిర్ధారణకు వచ్చాం. ఈ విధ్వంసం వల్ల రూ. 20 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ నర్సయ్య 18 మంది సాక్షులను విచారించారు అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. కాగా, 12 మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు సమాచారం.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM