ఆగస్టులో హైదరాబాద్ కు మరో దిగ్గజ కంపెనీ రాక: కేటీఆర్

byసూర్య | Mon, May 23, 2022, 08:29 PM

స్విస్ రే బీమా సంస్థకు ఘనస్వాగతం పలుకుతున్నామని, ఈ సంస్థ వచ్చే ఆగస్టులో హైదరాబాదులో కార్యాలయం స్థాపించబోతోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణకు భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన అజెండాగా దావోస్ వేదికగా మంత్రి కేటీఆర్ ముమ్మరంగా శ్రమిస్తున్నారు. ఇవాళ కూడా పలువురు పారిశ్రామిక, వ్యాపార దిగ్గజాలతో ఆయన సమావేశమయ్యారు. తన చర్చల్లో పురోగతి గురించి కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ బ్యాకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగానికి మరో దిగ్గజ సంస్థ జత కడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. 


బీమా రంగంలో స్విస్ రే సంస్థకు 160 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందని ఆయన వివరించారు. స్విట్జర్లాండ్ లోని జూరిచ్ లో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉందని, ప్రపంచవ్యాప్తంగా 80 ప్రాంతాల నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఇక, హైదరాబాదులో స్విస్ రే సంస్థ తొలుత 250 మంది సిబ్బందితో ప్రారంభం కానుందని కేటీఆర్ ట్విట్టర్ లో వివరించారు. డేటా, డిజిటల్ సామర్థ్యాలు, ఉత్పత్తి నమూనాలు, విపత్తు నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారించనుందని వెల్లడించారు. 


దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తమను కలిసి ఆలోచనలు పంచుకున్నందుకు స్విస్ రే గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వెరోనికా స్కాట్, సంస్థ ఎండీ (పబ్లిక్ సెక్టార్ సొల్యూషన్స్) ఇవో మెంజింగర్ లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా కేటీఆర్ ట్విట్టర్ లో పంచుకున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM