![]() |
![]() |
byసూర్య | Sat, May 14, 2022, 11:37 AM
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వచ్చి పోతామంటే కుదరదు అని అమిత్ షా పర్యటనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ప్రకటించాలని, విభజన హామీలను నెరవేర్చాలని సబిత డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎల్పీలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచి రెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్ లతో కలిసి హైదరాబాద్ టీఆర్ఎస్ఎల్పీ లో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులను నెరవేర్చాలని రాష్ట్ర ప్రజల తరపున అమిత్ షాను అడుగుతున్నామని తెలిపారు. విభజన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదు. ట్రైబల్ యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఊసే లేదని ధ్వజమెత్తారు. విభజన హామీలను అమలు పరచడంలో విఫలమయ్యారని చెప్పడానికి వస్తున్నారా? లేక ఏదైనా హామీ ఇచ్చి పోతున్నారా? అనే విషయంలో అమిత్ షా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు నయా పైసా ఇవ్వలేదు. కనీసం జాతీయ ప్రాజెక్టుగా కూడా గుర్తించలేదు. పాలమూరు ఎత్తిపోతలకైనా జాతీయ హోదా ప్రకటించాలని సబిత డిమాండ్ చేశారు. కర్ణాటకలోని అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చారు. మరి పాలమూరు సంగతేంటి? అని సబిత ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల పట్ల వివక్ష ఎందుకు చూపుతున్నారని అడిగారు. పాలమూరుకు జాతీయ హోదా ఇస్తామని సుష్మా స్వరాజ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
కృష్ణా నదిలో వాటాపై స్పందించాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసి పాలమూరు ప్రజలకు సాగునీరు అందిద్దామని సీఎం కేసీఆర్ సంకల్పిస్తే. దానికి బీజేపీ నేతలు అడ్డంకులు సృష్టించారు. కృష్ణా నదిలో తెలంగాణకు రావాల్సిన వాటా గురించి కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ అనేక సార్లు మొర పెట్టుకున్నారు. కానీ స్పందన లేదు. దీనిపై కూడా అమిత్ షా స్పందించాలన్నారు. తెలంగాణ విద్యార్థులను విస్మరిస్తున్న కేంద్రం సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని పటిష్టం చేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణకు విద్యా సంస్థలను కేటాయించకుండా ఇక్కడి విద్యార్థులను కేంద్రం విస్మరిస్తుందని ధ్వజమెత్తారు. ఐఐఎంలు, ఐఐటీలు కేటాయించలేదు. ట్రిపుల్ ఐటీలు కూడా ఇవ్వలేదు. మెడికల్ కాలేజీల విషయంలోనూ కేంద్రం వివక్ష ప్రదర్శించిందని మంత్రి నిప్పులు చెరిగారు. ధరల పెరుగుదలతో ప్రజలపై పెనుభారం రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు పెరిగాయని సబితా తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు.