దొడ్డు రకం ధాన్యం దించుకోని రైస్ మిల్లులపై కఠిన చర్యలు: కలెక్టర్

byసూర్య | Sat, May 14, 2022, 09:20 AM

కొనుగోలు కేంద్రాల ద్వారా లారీలలో పంపిన ధాన్యం నిల్వలను సకాలంలో దించుకోని రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి దొడ్డు రకం ధాన్యం అన్లోడ్ చేయడంలో అలసత్వం వహించే మిల్లులను సీజ్ చేసేందుకు కూడా వెనుకాడవద్దని తేల్చి చెప్పారు. శుక్రవారం సాయంత్రం వరి ధాన్యం సేకరణ పై మండల, డివిజన్ స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలతో ఉన్న లారీలను సకాలంలో అన్లోడ్ చేయకుండా అలాగే నిలిపివేస్తుండడం వల్ల, కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం వెంటదివెంట రవాణా చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ధాన్యం సేకరణ పైనా దీని ప్రభావం పడుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు కురిస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం నిల్వలను ఏ రోజుకు ఆ రోజే రైస్ మిల్లుల వద్ద దించుకునేలా చూడాలని, ఈ ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలని తహసీల్దార్లను ఆదేశించారు.


కాగా ధాన్యం రవాణా కోసం 1600 వాహనాలు అనునిత్యం తిరగాల్సిందేనని, ఏ ఒక్క వాహనం రాకపోయినా సంబంధిత కాంట్రాక్టరుకు జరిమానా విధించాలని పౌర సరఫరాల సంస్థ అధికారి అభిషేక్ ను ఆదేశించారు. ఇంకను ధాన్యం తరలింపు కోసం అదనంగా వాహనాలు అవసరమైతే సమకూర్చుకోవాలని, దీనికి పోలీస్ శాఖ కూడా సహకరిస్తుందని తహసీల్దార్లకు సూచించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యానికి సంబంధించి వెంటవెంటనే బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తూ, గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.


రైస్ మిల్లులకు సమాన నిష్పత్తిలో దొడ్డు, సన్న రకం ధాన్యం నిల్వలు పంపించాలని డీ ఎస్ ఓ కు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు డీసీపీ అరవింద్ బాబు, జెడ్పి సీఈఓ గోవింద్, డీపీవో జయసుధ, డీటీసీ వెంకటరమణ, డీఆర్డీవో చందర్, జిల్లా వ్యవసాయ అధికారి ఐ. గోవింద్, ఆర్దీవోలు రాజేశ్వర్, రవి, శ్రీనివాస్, ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM