హుజురాబాద్‌లో గెలిచేది ఎవరు?

byసూర్య | Mon, Oct 25, 2021, 11:39 AM

హుజూరాబాద్ ఉప ఎన్నిక బీజేపీ, టీఆర్ఎస్‌లను టెన్షన్ పెట్టిస్తోంది. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా.. లోపల మాత్రం నేతల హార్ట్ బీట్ పెరిగిపోతోంది. ఓటర్ల మనసులో అసలు ఏముందో తెలియక పార్టీలు తెగ గింజుకుంటున్నాయి. పైకి మీకే ఓటు వేస్తామని ఎవరికి వారు ఓటర్లు చెబుతున్నా తెలియని భయం పార్టీలని బాగా వెంటాడుతోంది. మాట వరసకు చెబుతున్నారా లేక మనసులో ఉన్న మాటే చెబుతున్నారా అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. దీంతో మళ్లీ మళ్లీ వెళ్లినవారి దగ్గరకే వెళ్లి.. ఓట్లను అభ్యర్థిస్తున్నారు నేతలు.ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందునుంచే నాలుగు నెలలుగా హుజూరాబాద్‌లో హోరాహోరీ ప్రచారం చేశాయి పార్టీలు. తమను గెలిపిస్తేనే భవిష్యత్తు అని.. తమకే ఓటు వేయాలని వేటికవి ఓటర్లను ప్రాధేయపడుతున్నాయి. అయితే ఓటరు మాత్రం బయటపడటం లేదు. కొన్ని చోట్ల నేతల కంటే కూడా ఓటర్లే తెలివిగా ప్రవర్తిస్తున్నారు. ఏ పార్టీ లీడర్లు పలకరించినా, మీకే ఓటు వేస్తాం.. అవతలి పార్టీ మాకు చేసిందేమీ లేదు.. అంటూ వచ్చిన వారితో తెలివిగా మాట కలిపేస్తున్నారు ఓటర్లు. దీంతో వారి అతి ఉత్సాహాన్ని చూసి నమ్మాలో, నవ్వుకోవాలో తెలియక నేతలు తికమకపడుతున్నారు.మరికొందరు ఎన్నికల రోజునాటికి.. ఏదైనా ఇస్తారేమోనని ఇరు పార్టీలకు జైకొడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ చేసిన అభివృద్ధి, దళిత బంధు పథకంపై నమ్మకం పెట్టుకుని ప్రచారం సాగిస్తోంటే.. ఈటల తనకు జరిగిన అవమానం, హుజూరాబాద్‌ అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఓటర్లు మాత్రం రెండు పార్టీలను సమానంగానే ఆదరిస్తున్నారే తప్ప.. తమ మద్దతు ఎవరికి అన్నది చెప్పడం లేదు. వాస్తవానికి ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే హుజూరాబాద్ వాసులు డిసైడైపోయారంటున్నారు.మరోవైపు టీఆర్ఎస్ పార్టీ వందల కోట్ల రూపాయలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి ఖర్చు చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. టిఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవడానికి బీజేపీ కూడా ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు ప్రయతిస్తోంది. అయితే అధికార పార్టీలా బీజేపీ ఖర్చు చెయ్యలేదన్నది అందరికీ తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, మంత్రులు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ వ్యూహాత్మకంగా బీజేపీపై మాటల దాడికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి మద్దతు ఇచ్చే వర్గాలను గుర్తించి వారు బీజేపీకి మద్దతు ఇవ్వకుండా ఉండేలా చూసుకుంటున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ పై పోరాటం చేస్తున్నప్పటికీ, ఈ పోరాటంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన అటు ఈటల రాజేందర్ లోను వ్యక్తమవుతున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించాలని గులాబీ బాస్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగారు టీఆర్‌ఎస్ అగ్రశ్రేణి నేతలు.అయితే, ఎవరు గెలిచినా మెజారిటీ మాత్రం తక్కువగా వుంటుందని అంతా భావిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచి అవకాశం లేదని సర్వేలు సూచిస్తున్న నేపథ్యంలో కొద్దిపాటి మెజారిటీ నే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అధికార దుర్వినియోగానికి టీఆర్ఎస్ పార్టీ పాల్పడుతుందని బీజేపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు.ఈ విమర్శల వెనుక బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఇక కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని, అందుకే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టి బీజేపీ నుండి బరిలో ఉన్న ఈటలకు సపోర్ట్ చేస్తుందని టీఆర్ఎస్ పార్టీ మంత్రులు చేస్తున్న విమర్శలు కూడా ఓటమి భయంతోనే అన్న ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు.


Latest News
 

150 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరికలు Sat, Apr 20, 2024, 10:49 AM
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి Sat, Apr 20, 2024, 10:34 AM
కాంగ్రెస్ పార్టీలో చేరికలు Sat, Apr 20, 2024, 10:32 AM
గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM