కేసీఆర్‌ సభ జరగకుండా బీజేపీ కుట్రలు : మంత్రి గంగుల

byసూర్య | Sun, Oct 24, 2021, 06:45 PM

దేశంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో సీఎంల బహిరంగసభలు జరుగుతుండగా కేవలం కావాలని తెలంగాణలో హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ సభ జరగకుండా బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు కుట్రలు చేశారని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ధరలు పెంచి ప్రజలను నట్టేట ముంచుతున్న కేంద్రంలోని బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలో ఆ పార్టీ నేతలు ప్రజలకు చెప్పాలని కమలాకర్ డిమాండ్ చేశారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని బోర్నపల్లిలో మంత్రి గంగుల ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్‌ కులస్థులు మంత్రి గంగులను కలిసి మద్దతు లేఖను అందజేశారు.


టీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను చూసి ముదిరాజ్‌ కులస్థులకు చేస్తున్న అభివృద్ధిని చూసి, ప్రభుత్వ పని తీరుకు ఆకర్షితులయి టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్ధతు తెలపాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. ముదిరాజ్‌ కులస్తులు కుటుంబ సమేతంగా టీఆర్‌ఎస్ కు మద్దతు తెలపడమే కాకుండా కారు గుర్తుకే ఓటేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించుకొని ఆ తీర్మాన లేఖను మంత్రి గంగులను కలిసి అందజేశామన్నారు.


ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ ప్రైవేటీకరణ పేరుతో ఆస్తులమ్ముకోవడమే బీజేపీ విధాన మన్నారు. వ్యవసాయ బాయికాడ మోటార్లకు మీటర్లు పెట్టే బీజేపీ పార్టీని ప్రజలు పాతరేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమగ్ర విధానాల వల్ల దేశం తీవ్రంగా అన్నిరంగాల్లో నష్టపోతుందని, అన్ని అంశాల్లో విఫలమై దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నారన్నారు. ఓవైపు ప్రైవేటీకరణ పేరిట భారీగా ప్రజా ఆస్థుల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తూ మరోవైపు రోజు రోజుకు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధరల్ని పెంచుకుంటూ పోతున్నారని దుయ్యబట్టారు.


తెలంగాణ ప్రజలు కడుతున్న పన్నుల్లోంచి అత్యధిక శాతం జీఎస్టీ రూపంలో తీసుకుంటూ దానిలో సగం కూడా రాష్ట్రానికి ఇవ్వకుండా తెలంగాణపై వివక్ష చూపుతున్న పార్టీ బీజేపీ అని గంగుల అన్నారు. ప్రచారంలో ఉన్న బీజేపీ అభ్యర్థి కానీ వారి కేంద్ర మంత్రులు కానీ హుజురాబాద్‌కు, తెలంగాణకు ఏం చేస్తామో చెప్పకుండా మభ్యపెట్టే జూటా మాటల్ని వల్లే వేస్తున్నారని, అన్నింట్లో తమ వాటా ఉందని చెప్పే బీజేపీ నాయకులు దళితబంధులో ఎందుకు వాటా ఇవ్వడంలేదో ప్రశ్నించాలన్నారు.


ధళితబంధు కోసం మరో పది లక్షలు అధనంగా కేంద్రం నుండి బీజేపీ నేతలు ఇప్పించాలని, లేని పక్షంలో బీజేపీకి తమ ఓటు ద్వారా బుద్ది చెప్పాలన్నారు. వ్యవసాయ బావుల మోటార్లకు మీటర్లు పెడితే రైతులు ఎలా బతుకాలో బీజేపీ నాయకులు చెప్పాలని, సామాన్యుల్ని దోచి బడా బాబులు అదాని, అంబానీలకు ఈ దేశాన్ని అప్పజెప్పే పచ్చి అవకాశ వాదుల్ని తరిమికొట్టాలన్నారు, యాదాద్రిలో శ్రీ లక్ష్మీనర్షింహస్వామి ఆలయాన్ని ఎంతో గొప్పగా నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు అండగా ఉండి, బీజేపీ నేతల జూటామాటలను తిప్పికొట్టాలన్నారు.


మతం పేరుతో చిచ్చు పెట్టి పబ్బం గడిపే బీజేపీ నేతల్ని నియోజకవర్గంలో చేసిన అభివృద్ది ఏమిటో ప్రశ్నించాలని మంత్రి గంగుల పేర్కొన్నారు. హుజురాబాద్‌లో గతం కన్నా భారీ మెజార్టీతో కేసీఆర్‌ బలపర్చిన టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలన్నారు. ఈనెల ముప్పైన జరిగే ఓటింగ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని టీఆర్‌ఎస్ కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని మంత్రి గంగుల కోరారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM