ఈటల పై ముప్పేట దాడికి టీఆర్‌ఎస్‌ ప్రణాళిక.. ఇన్‌చార్జిగా మంత్రి గంగుల

byసూర్య | Sat, Jun 05, 2021, 10:00 AM

నెలరోజుల ఉత్కంఠకు ముగింపు లభించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. తన మద్దతుదారులతో కలిసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకుంటానని ప్రకటించారు. దీంతో 19 సంవత్సరాల పాటు టీఆర్‌ఎస్‌తో ఉన్న అనుబంధానికి ఫుల్‌స్టాప్‌ పడింది. ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకులను కలిసి వచ్చిన తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను వదిలి బీజేపీలో చేరాలని ఈటల నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాతే బీజేపీలో చేరాలనే నిబంధన మేరకే ఆయన శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. ఒకటి రెండు రోజుల్లో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించనున్నారు.


ఈటల రాజీనామా ఆమోదం పొందితే మరోసారి హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు టీఆర్‌ఎస్‌ స్థాపించిన తరువాత 2002లో ఈటల రాజేందర్‌ గులాబీ కండువా కప్పుకున్నారు. ఉద్యమాల ఖిల్లాగా పేరొందిన కరీంనగర్‌ జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కొద్దిమంది ముఖ్య నాయకుల్లో ఈటల ఒకరు.  


2004 అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపూర్‌ నుంచి పోటీ చేసి అప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌ రెడ్డిపై తొలిసారి విజయం సాధించారు.


నాటి నుంచి వెనుదిరిగి చూడని ఈటల 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు.


2009లో శాసనసభ స్థానాల పునర్విభజనలో హుజూరాబాద్‌కు వెళ్లిన ఈటల మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు.


2010లో తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు.


శాసనసభలో టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ నాయకుడిగా 2014 వరకు కొనసాగారు.


2014లో రాష్ట్ర అవతరణ అనంతరం జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి కేసీఆర్‌ కేబినెట్‌లో ఏకంగా ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.


2018 ఎన్నికల్లో గెలిచి టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగానే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


తరువాత జరిగిన పరిణామాలతో నెలరోజుల క్రితం మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు. రేపోమాపో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు . 


ఈటల టీఆర్‌ఎస్‌కి రాజీనామా చేసి హుజూరాబాద్‌కు రానున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ కౌంటర్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. ఉప ఎన్నిక అనివార్యం అని తేలడంతో మాజీ మంత్రి ఈటల పై ముప్పేట దాడికి టీఆర్‌ఎస్‌ రంగం సిద్ధం చేస్తోంది. ఈనెల 11, 12 తేదీల్లో మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ తదితర ముఖ్య నాయకులతో హుజూరాబాద్‌లో పర్యటన ఖరారైంది. మొత్తంగా మండలాల్లో ఈటలకు మద్దతుగా ని లిచిన పార్టీ కేడర్‌ను కూడా ఆయనకు దూరం చేసే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.  కరీంనగర్‌ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌ను ఇన్‌చార్జిగా నియమించింది. హుజూరాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులెవ్వరూ ఆయన వెంట వెళ్లకుండా 'కట్టుదిట్టమైన' ఏర్పాట్లు చేయించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈటల వెంట జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమతోపాటు హుజూరాబాద్‌కు చెందిన కొందరు నాయకులు మినహా ఎవరూ వెళ్లలేదు. ప్రజాబలం తనకు ఉందని చెపుతున్న ఈటలను ప్రజాప్రతినిధులను కట్టడి చేయడంతో ఇరుకున పెట్టి విజయం సాధించారు.


Latest News
 

భక్తి శ్రద్ధలతో సాగిన రథోత్సవం Sat, Apr 20, 2024, 12:22 PM
ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు Sat, Apr 20, 2024, 12:21 PM
ఏకో పార్కులో యువతి డెడ్బాడీ కేసు అప్డేట్ Sat, Apr 20, 2024, 12:19 PM
భక్తుల మనోభావాలు గౌరవించాలి: ఎంపి Sat, Apr 20, 2024, 12:16 PM
ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు Sat, Apr 20, 2024, 12:14 PM