పండుగ సీజన్ మొదలైన... రోడ్డెక్కని బస్సులు..

byసూర్య | Mon, Oct 19, 2020, 11:53 AM

దసరా పర్వదినాలు మొదలైపోయాయి. ఇప్పటికే మూడు రోజులు గడిచింది. విద్యార్థులకు స్కూళ్లు జరగడం లేదు. ఈ పండగ రోజుల్లో స్వస్థలాలకు వెళ్లాలని భావిస్తున్న లక్షలాది మంది, ఎలా వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. పూర్తి స్థాయిలో రైళ్లు తిరగడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు కూడా లేవు.


సొంత వాహనాల్లోనో లేదా, ప్రైవేటు బస్సుల్లోనో మాత్రమే రాష్ట్రాల సరిహద్దులు దాటాల్సిన పరిస్థితి. ఉన్న రెండు మూడు రైళ్లు ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోతున్న వేళ, ఆర్టీసీకి ఆదాయం కురిపించే పండగ సీజన్ లో కూడా బస్సులు నడిపించక పోవడంపై రెండు తెలుగు రాష్ట ప్రభుత్వాల మొండి వైఖరిపై ప్రజల నుంచి విమర్శలు పెరుగుతున్నాయి.


వాస్తవానికి పరిస్థితులు మామూలుగా ఉంటే, దసరా సీజన్ లో తెలంగాణ నుంచి సుమారు 8 లక్షల మంది వరకూ ఏపీకి వెళతారు. పండగకు నాలుగైదు రోజుల ముందు నుంచే రెండు ఆర్టీసీలూ ప్రత్యేక బస్సులను నడిపించాల్సి వుంటుంది. వాటిల్లో 50 శాతం మేరకు చార్జీలు పెంచినా, పండగల వేళ వాటిని పట్టించుకోకుండా ప్రజలు వెళుతుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, కరోనా లాక్ డౌన్ మొదలైన తరువాత, రెండు రాష్ట్రాల మధ్యా బస్సులు నిలిచిపోయాయి.


బస్సు సర్వీసుల పునరుద్దరణకు ఎన్ని చర్చలు జరిగినా, ఫలితం మాత్రం రాలేదు. రెండు ప్రభుత్వాలూ పట్టు విడుపులను ప్రదర్శించలేదని ప్రజలు అంటున్నారు. కలెక్షన్ల వర్షం కురిపించే పండగ సీజన్ లో సైతం బస్సులు లేకపోవడాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కూడా తప్పుపడుతున్నాయి. పెద్దఎత్తున ఆదాయం లభించే ఈ సీజన్ లో బస్సులు లేకపోతే ఎలాగని వారు ప్రశ్నిస్తుంటే, తాము పండగను సొంత ఊరిలో బంధుమిత్రుల మధ్య ఎలా జరుపుకోవాలని పేదలు, మధ్య తరగతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


ఈ పరిస్థితికి కారణం ఏపీ, టీఎస్ ఆర్టీసీ అధికారుల మొండి వైఖరే కారణమని విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే అదనుగా రాష్ట్రాలను దాటే ప్రయాణికుల నుంచి ప్రైవేటు బస్సు యాజమాన్యాల దోపిడీ మొదలైంది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆర్టీసీ చార్జ్ రూ. 290 వరకూ ఉండగా, ప్రైవేటులో 500కు పైగా వసూలు చేస్తున్నారు. ఈ బుధవారం తరువాత అయితే, ప్రైవేటు బస్సులో విజయవాడకు వెళ్లాలన్నా రూ. 800 నుంచి రూ. 1000 వరకూ వదిలించుకోక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అంతర్రాష్ట్ర సర్వీసులపై ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.


Latest News
 

బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM
కాంగ్రెస్ పార్టీ జువ్వాడి గ్రామ కమిటీ ఎన్నిక Fri, Mar 29, 2024, 02:52 PM