బయోమెట్రిక్ లేకుండానే రేషన్ సరఫరా

byసూర్య | Mon, Mar 30, 2020, 10:45 AM

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా పై ఆదివారం అధికారులతో సమీక్షించారు. లాక్ డౌన్ పరిస్థితులు, రైతుల ధాన్యం కొనుగోలు విధానం పై ప్రధానంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే… “తెలంగాణలో ప్రస్తుతం 70 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో 11 మందికి కరోనా నెగటివ్ వచ్చింది. లాక్ డౌన్ పై ప్రపంచ దేశాలు భారత్ ను ప్రశంసిస్తున్నాయి. మన వద్ద ఉన్న ప్రధాన ఆయుధం లాక్ డౌనే. కొత్తగా కేసులు నమోదయ్యే అయ్యే అవకాశం తక్కువ. కరోనా వైరస్ ప్రమాదకరమైంది. సౌత్ కొరియాలో ఒక వ్యక్తి వల్ల 59 మందికి వచ్చింది. హోం క్వారంటైన్ లో ఉన్న వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. సీరియస్ గా ఉన్న కేసుల పై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఏప్రిల్ లో కరోనా ఫ్రీగా తెలంగాణ మారుతుంది. ఈ వ్యాధికి మందు లేదు. సెల్ఫ్ కంట్రోలే ముఖ్యం. తెలంగాణలో 50 లక్షల ఎకరాలలో పంట ఉంది. గ్రామాలల్లోనే ధాన్యాన్ని కొంటాం. మార్కెట్ యార్డులన్ని బంద్ చేసినం. గ్రామాలల్లో కూపన్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. గ్రామాలల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలల్లోనే వరి,మొక్కలు కొంటాం. రైతులకు కూపన్లు ఇస్తాం. ఆ కూపన్లలో ఉన్న తేది రోజు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. డేట్ కు ముందు కానీ, తర్వాత కానీ రావద్దు. ఖచ్చితంగా అదే రోజు రావాలి. నెల 15 రోజులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. ఏప్రిల్ మొదటి వారం నుంచి మే 20 వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. బ్యాంకు ఖాతా ద్వారా ఆన్ లైన్ లో డబ్బులు వేస్తాం. ప్రతి చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. ఎక్కువ మంది గుమికూడవద్దనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రస్తుతం గ్రామాలల్లో కరోనా లేదు. గ్రామాలల్లో వైరస్ సోకవద్దంటే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. పౌరసరఫరాల శాఖకు ప్రభుత్వం 25 వేల కోట్ల రూపాయలు సమకూర్చింది. మార్క్ ఫెడ్ సంస్థకు కూడా 3600కోట్లు కేటాయించాం. ఇంత కష్ట పరిస్థితులలో కూడా రైతులకు ఇబ్బంది రావద్దని పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. దేశంలోనే ఏ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించలేదు. ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితి ఆగం ఆగం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ రైతుల కోసం ముందు జాగ్రత్తతో నిధులు కేటాయిస్తున్నాం. ముళ్ల కంచెలను తొలగించండి. వ్యాధి రాకుండా కాపాడుకుంటూనే సర్పంచ్ లు, ఎంపీటీసీలు సమన్వయంతో ముందుకు సాగాలి. రైతుల ధాన్యం కొనాలంటే బండ్లు ఊర్లకు రావాలి. అవి రావాలంటే మీరు కంచె తీయాల్సి ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెంచే సీ విటమిన్ పండ్లను ప్రజలు ఎక్కువ తినాలి.మన పండ్లు మనకే సరఫరా అయ్యేటట్టు చర్యలు తీసుకుంటాం. పండ్లు,కూరగాయలు,కోళ్లు,గుడ్లు తీసుకెళ్లే వాహనాలను అనుమతించాలని పోలీసులను కోరుతున్నాం. అదే విధంగా ప్రజలు కూడా సహకరించాలి. హైదరాబాద్ లో 500 కేంద్రాల్లో పండ్ల బజార్లను ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించాం. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలున్నారు. వీరంతా వివిధ రంగాల్లో తెలంగాణలో పని చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో వీరు ఆకలికి చావద్దని కలెక్టర్లకు చెప్పిన. ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కొక్కరికి రూ.500 ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉంది. అందుకే వారు ఆకలికి ఇబ్బంది పడవద్దని అధికారులకు చెప్పిన. వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. వారికి ఉచిత వసతి,భోజనం,వైద్యం అందించాలని ఆదేశిచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో ఒక్కరు కూడా ఆకలికి చావవద్దు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కరోనా వైరస్ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అర్ధం కావడం లేదు. దీని పై ప్రతిక్షణం అలర్ట్ గా ఉండాల్సి ఉంది. అలాగే 100 మంది డాక్టర్లు అవసరం ఉంటే 130 మందిని తీసుకోమన్నాను. అదే విధంగా రిటైర్ డాక్టర్లు,నర్సులు,సిబ్బందిని కాంట్రాక్టు పద్దతిలో తిరిగి చేర్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సీఎస్ ప్రకటనలు కూడా ఇచ్చారు. కొంత మంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వారందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. రేషన్ దుకాణాల వద్ద ప్రజలు బయోమెట్రిక్ లేకుండానే తీసుకోవచ్చు. ఎలాగూ ఉచితంగానే పంపిణీ చేస్తున్నాం. ఇందులో కూడా దొంగలు పడుతారా. పడరు కదా. ప్రజల క్షేమం కోసమే చేస్తున్నాం. ఎలాగూ రేషన్ తీసుకునే వారిని ఆ డీలర్ గుర్తు పడుతాడు. కాబట్టి మోసం జరగదు.కరోనా వల్ల ఇబ్బంది రాకుండా బయోమెట్రిక్ లేకుండానే రేషన్ సరుకులు తీసుకోవచ్చు. ఏ గ్రామ నాయకులు ఆ ఊరి కథానాయకులు కావాలి. మద్దతు ధర ప్రకారమే ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఇస్తాం. మిల్లర్లు ఎవరైనా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తే మేం అడ్డుకోం. కానీ ప్రభుత్వ మద్దతు ధర చెల్లించాలని షరతు పెడుతున్నాం. అలా అయితేనే అనుమతిస్తాం. లేకుంటే లేదు. సోమవారం రైసు మిల్లర్ల అసోసియేషన్ తో చర్చలు జరుపుతున్నాం. తెలంగాణలో కరోనా ప్రభావం దాదాపు తగ్గింది.” అని సీఎం కేసీఆర్ అన్నారు.


Latest News
 

అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM
ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Tue, Apr 23, 2024, 12:50 PM
ఎల్లమ్మ పోచమ్మ నాగదేవత ఆలయ పునర్ నిర్మాణ పనులు Tue, Apr 23, 2024, 12:35 PM
యాదాద్రి స్వామి వారి హుండీల లెక్కింపు ప్రారంభం Tue, Apr 23, 2024, 12:35 PM
డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి Tue, Apr 23, 2024, 12:33 PM