వలస కూలీలకు భోజన, వసతి కల్పించాలి : మంత్రి సత్యవతి రాథోడ్

byసూర్య | Sun, Mar 29, 2020, 05:32 PM

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల జిల్లాలో వలస కూలీలు, దినసతి కూలీలు ఎవరికీ భోజన, వసతి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. అదేవిధంగా కూలీల పిల్లలకు అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు, ఆహారం అందించాలన్నారు. వ్యవసాయ పనుల్లో కూలీలకు ఉపాధి కల్పించాలని, వారికి ప్రభుత్వం ప్రకటించిన 12 కిలోల రేషన్, 1500 రూపాయలు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అందించాలన్నారు. మహబూబాబాద్ జిల్లాలో వలసకూలీలు, దినసరి కూలీలు, విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్ లో ఉన్న కరోనా బాదితులు, ధాన్యం కొనుగోలుపై ఆదివారం మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ వి.పి గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, మునిసిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డిలతో సమీక్ష చేశారు. జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ధాన్యం, పంట నిలువ కోసం గోదాములను సరిగా నిర్వహించాలని, రైతులపై ఈ లాక్ డౌన్ ప్రభావం ఉండకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 105 మంది క్వారంటైన్ పై నిరంతర నిఘా ఉంచాలన్నారు. వీరిలో 14 రోజులు క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లిన వారిపై కూడా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, క్వారంటైన్ పూర్తి చేసుకునే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, వైరస్ సోకినట్లు అనుమానమున్న వారి నమూనాలు పరీక్షకు పంపించిన వాటి ఫలితాలు వచ్చిన తర్వాతనే వారిని క్వారంటైన్ నుంచి బయటకు పంపాలని సూచించారు. గ్రామాల్లో కరోనా వ్యాప్తి నివారణ చర్యలో భాగంగా సరిహద్దుల్లో ముళ్ల కంచెలు వేసుకున్న వారికి నచ్చ చెప్పి, వాటిని తీయించాలని, అత్యవసర సేవలు అందించడంలో వాటివల్ల కలుగుతున్న ఇబ్బందులను వివరించాలన్నారు. ప్రతి చోట శానిటైజేషన్ పనులు పకడ్బందీగా చేపట్టాలని, అనవసరంగా ఎవరూ కూడా రోడ్ల మీదకు రాకుండా చూసుకోవాలని, నిత్యావసర వస్తువులు కొనుగోళ్ల దగ్గర ప్రజలు గుమి కూడకుండా సామాజిక దూరం పాటించేలా కచ్చితమైన జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం ప్రభుత్వం తరపున ఉండకుండా చూసుకోవాలని, అదే సమయంలో ప్రజలు కూడా సహకరించే విధంగా వారికి అవగాహన కల్పించాలని, అతిక్రమించిన వారి పట్ల చట్టబద్ద చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


Latest News
 

కాంగ్రెస్ లో చేరనున్న 25 మంది మాజీ సర్పంచ్లు Wed, Apr 24, 2024, 12:22 PM
డబ్బు, మద్యం అక్రమ రవాణాపై నిఘా: ఎస్పీ Wed, Apr 24, 2024, 12:21 PM
పూజలు నిర్వహించిన ఎంపీ అభ్యర్థి రఘువీర్ Wed, Apr 24, 2024, 11:42 AM
ఫోన్ ట్యాపింగ్ అంశంపై తొలిసారి స్పందించిన కేసీఆర్ Wed, Apr 24, 2024, 11:40 AM
చిన్నంగుల గడ్డ తండాలో జడ్చర్ల ఎమ్మెల్యే పూజలు Wed, Apr 24, 2024, 11:39 AM