ముగిసిన నామినేషన్ల ఘట్టం.. తప్పని రెబల్స్ బెడద

byసూర్య | Tue, Jan 14, 2020, 07:50 PM

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఈ రోజు 3గంటలకు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థకు నామినేషన్ల ప్రక్రియ ఈనెల 16న ముగియనున్నది. మిగతా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు ఈ రోజు 3గంటలతో ముగిసింది. పది కార్పొరేషన్లల్లో 385 వార్డులకు 1786 పోలింగు కేంద్రాలు, 120 మున్సిపాలిటీల్లో 2727 వార్డులకు 6325 పోలింగు కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో 25,768 నామినేషన్లు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వాటిలో 432 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 25,336 నామినేషన్లు చెల్లుబాటయ్యాయని, 19,673 మంది బరిలో నిలిచారని ఎస్‌ఈసీ ప్రకటించింది.


రాజకీయ పార్టీల తరపున అభ్యర్థులకు అధికారికంగా బీ ఫారాలు అందజేసే గడువు కూడా నేటితో ముగిసింది. అధికార పార్టీకి రెబల్స్‌ బెడద తప్పలేదు. పలు చోట్ల టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ బరిలోకి దిగారు. టీఆర్‌ఎస్‌ నుంచి అధికంగా 8,956మంది నామినేషన్లు దాఖలు చేశారు. తరువాత స్థానాల్లో కాంగ్రెస్‌ (5,356 మంది), బీజేపీ (4,176 మంది) పార్టీ అభ్యర్థులు నిలిచారు.


టీఆర్ఎస్ నుంచి భారీగా బరిలో రెబల్స్


టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు రెబల్స్ గా నిలిచారు. అయా పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రెబల్స్ ను బుజ్జగించినప్పటికీ చాలా మంది దారికి రాలేదు. రెబల్స్ గా పోటీలో ఉండేందుకు ఆసక్తి చూపారు. అంతేకాకుండా రెబల్స్ గా గెలిస్తే తిరిగి టీఆర్ఎస్ కే మద్దతు ఇస్తారనే ఆశతో పోటీలో ఉన్న ఇబ్బంది లేదన్న కోణంలో టీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. అధికారపార్టీ నుంచి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు పోటీ చేసేందుకు ముందుకు రావడంతో బుజ్జగించడం ఇబ్బంది కరంగా మారింది. ఎన్ని రకాలుగా వారికి ఆశలు చూపించినప్పటికీ చాలా ప్రాంతాల్లో రెబల్స్ ససేమిరా అన్నారు. దీంతో రెబల్స్ నుంచి టీఆర్ఎస్ గట్టి దెబ్బ తగిలే అవకాశాలున్నట్లు తెలిసింది. టిక్కెట్‌ రాలేదనే కారణంతో టీఆర్‌ఎస్‌ నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సూర్యాపేటలో కలకలం రేగింది. టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం టిక్కెట్‌ కేటాయించలేదని తీవ్ర మనస్తాపం చెందిన టీఆర్‌ఎస్‌ నేత అబ్ధుల్‌ రహీం తన నివాసంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. పట్టణంలో 39వవార్డు నుంచి టిక్కెట్‌ ఆశించిన ఆయన భారీ ఊరేగింపుతో నామినేషన్‌ దాఖలు చేశారు. రెండు రోజుల నుంచి ప్రచారం చేపట్టారు. అదే వార్డు నుంచి చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మొరిశెట్టి సుధారాణి కూడా ఇంటింటి ప్రచారం చేసుకుంటున్నారు. టిక్కెట్‌ ఖరారు కాకముందే ఇరువురు అభ్యర్థులు పోటీపడి ప్రచారం చేసుకోవడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. కాగా, మంగళవారం ప్రకటించిన జాబితాలో సుధారాణికి టిక్కెట్‌ ఖరారు కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన రహీం ఉరివేసుకుని ఆత్మహత్యయత్నానికి పాలడ్డారు. సమయానికి స్థానికులు గమనించి ఆయనను కాపాడారు. దీన్నిబట్టి టీఆర్ఎస్ కు రెబల్స్ కు గట్టి పోటీని ఎదుర్కోనున్నది.


కాంగ్రెస్ కు రెబల్స్ బెడద తప్పలేదు. అక్కడక్కడా చాలా మంది రెబల్స్ గా బరిలో ఉన్నప్పటికీ, మరికొంత మంది అధికార పార్టీలోకి వెళ్లారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇబ్బంది కరంగా మారింది. కామారెడ్డి మున్సిపల్‌ నామినేషన్‌ విత్‌డ్రా సెంటర్‌ వద్ద కాంగ్రెస్‌ ఆశావాహులు ఆందోళనకు దిగారు. కౌన్సిలర్‌ సీట్లను అమ్ముకున్నారని అభ్యర్థులు ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెదక్‌ మున్సిపాలిటీ 16వ వార్డులో ముందు చంద్రకళ అనే మహిళకు బీ ఫారం ఇచ్చిన కాంగ్రెస్‌ తర్వాత అదే వార్డుకు చెందిన టీఆర్‌ఎస్‌ రెబల్‌ వసంత రాజ్‌కు బీ పార్మ్‌ అందించింది. దీంతో కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగారు. టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి తన బి ఫారంను కాంగ్రెస్‌ నేత శేఖర్‌ చించేశాడు. దీంతో శేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా తలనొప్పులు తప్పడం లేదని తెలుస్తుంది.


బీజేపీ పార్టీకి రెబల్స్ బెడద పెద్దగా లేకపోయినప్పటికీ ఇతర పార్టీల్లో రెబల్స్ గా నామినేషన్లు వేసిన వారికి అక్కడక్కడా బీజేపీ బీ ఫారమ్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ కంటే ఎక్కువ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నప్పటికీ నామినేషన్లు వేయడంలోనూ కాంగ్రెస్ కంటే వెనకంజ వేసింది. దీంతో పట్టణ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచిచూడాల్సిందే.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM