ఆర్టీసీ సమ్మెపై స్పందించిన తమ్మారెడ్డి

byసూర్య | Sun, Oct 13, 2019, 07:47 AM

సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అంశంపై స్పందించారు. సంవత్సరాలు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా సమ్మెలు, సమస్యలు ఎందుకు పరిష్కారం కావట్లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు అత్యవసరమైన రవాణా, వైద్య సేవలు నిలిచిపోవడం ఆలోచించాల్సిన విషయమని అన్నారు. పండగ సమయాల్లో సమ్మెకు దిగడం సరికాదని ఉద్యోగులకు సూచించారు. కార్మికులను తొలగించడం న్యాయం కాదంటూ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ప్రజలకు తప్పనిసరైన సేవలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఇరువర్గాలకు తమ్మారెడ్డి సూచించారు. ఏదేమైనా కేసీఆర్‌పై నమ్మకం ఉందంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమ్మె చేసే హక్కు ప్రతివాడికీ ఉందని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. కానీ, సరిగ్గా టైమ్ చూసి చేయడం సరికాదన్నారు. సినిమాల్లో కూడా ఇలాంటివే ఎదురవుతాయని ఆయన గుర్తుచేశారు. పెద్ద సినిమా షూటింగ్‌లు పెట్టుకున్న రోజునే కార్మికులు సమ్మె చేస్తారని.. అలాగైతే ఒత్తిడి పెరిగి అడిగినవన్నీ ఒప్పుకుంటారని భావిస్తారని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ కార్మికులు కూడా ఇదే భావనతో పండగ పూట సమ్మెకు దిగారని తెలిపారు.‘12 వేల బస్సులు నిలిచిపోయాయి. 57 వేల మంది ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. చాలా వరకు ప్రయాణాలు ఆగిపోయాయి. పండక్కి వెళ్లాల్సిన వారు లక్షల మంది ఆగిపోయారు. బస్సుల్లో, కారుల్లో, లారీల్లో ఎట్లాబడితే అట్లా వెళ్లొస్తున్న వారు వెళ్తున్నారు. ఓపిక ఉన్నవాళ్లు వెళ్లారు. లేనివాళ్లు ఉండిపోయారు’ అని తమ్మారెడ్డి అన్నారు.ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వం లొంగలేదని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ‘పండగ అయిపోయింది. మరోవైపు ప్రభుత్వం కార్మికులను ఉద్యోగాల నుంచి తీసేస్తాం అంటోంది. అది కూడా న్యాయం కాదు. చర్చలు జరపాలి. చర్చలు ఎందుకు జరపడం లేదో.. జరిపితే ఎందుకు విఫలం అవుతున్నాయో తెలియదు. వీళ్ల డిమాండ్స్ ఏంటో.. వాళ్లు ఏం చెబుతున్నారో తెలియదు. కానీ, పండగల సమయంలో చాలా అవసరంగా ఉంటుంది. జనం చాలా అవసరాల కోసం రాకపోకలు సాగిస్తారు’ అని తమ్మారెడ్డి అన్నారు.రవాణా, వైద్య సేవలు సాధారణ ప్రజలకు చాలా అవసరమైన సేవలని తమ్మారెడ్డి భరద్వాజ గుర్తు చేశారు. ఈ రెండు విభాగాల్లో సమ్మెలు జరిగితే అటు ప్రయాణికులకు, ఇటు రోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయన్నారు. వీటిలో ఉద్యోగుల కోరికలు తీరాల్సిన అవసరం ఎంతైతే ఉందో.. ప్రజలకు ఉపయోగపడటం అంతే ఉందని తెలిపారు.‘సంవత్సరాల తరబడి ఆర్టీసీలో, అటు ఆస్పత్రుల్లో గొడవలు, సమ్మెలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా అవసరమైన విషయం కదా.. ఎందుకు పరిష్కరించలేకపోతున్నాం? ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ, సమ్మెలు మాత్రం ఆగట్లేదు’ అని తమ్మారెడ్డి అన్నారు.ఇప్పుడు ఆలోచించాల్సిన తరుణం వచ్చిందని తమ్మారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు అద్భుతం అన్నారని.. వాళ్లకు ఇంక్రిమెంట్లు కూడా ఇచ్చారని తమ్మారెడ్డి గుర్తుచేశారు. అలాంటి ఉద్యోగుల గురించి ఇవాళ ఎందుకు ఆలోచించట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘సకల జనుల సమ్మెలో పాల్గొన్న సోదరులను ఎందుకు ఆదుకోలేకపోతున్నాం. ప్రభుత్వాలు దీనిపై గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అన్నారు. 


Latest News
 

ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు Wed, Apr 24, 2024, 01:43 PM
పిచ్చి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు Wed, Apr 24, 2024, 01:41 PM
ట్రాన్స్‌కో ఉద్యోగి ఇంట్లో ఏసీబీ దాడులు Wed, Apr 24, 2024, 01:41 PM