తెలంగాణ అడ్డాలో నడ్డా నాటకాలు నడవవు

byసూర్య | Mon, Aug 19, 2019, 02:41 PM

తెలంగాణ అడ్డాలో బీజేపీ నడ్డా నాటకాలు నడవవు. ఇతర రాష్ర్టాల్లో వేసిన ఎత్తుగడలు తెలంగాణలో వేస్తే ఊరుకోం. బీజేపీ నేతలు అధికార మత్తులో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. కర్ణాటకలో బీజేపీ చేసిన నాటకాలు ఇక్కడ సాగవు. ఇది కర్ణాటక కాదు.. తెలంగాణ అని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి''. అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌.. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. 


'బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా 24 గంటల కరెంటు ఇస్తున్నారా? దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్నాం. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేసుకోవడానికే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ప్రాజెక్టుల నిర్మాణాలకు సహకరించాల్సింది పోయి విమర్శించడం సరికాదు. మిషన్‌ కాకతీయకు రూ.5వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేస్తే కేంద్రం ఎందుకు పట్టించుకోలేదు. మిషన్‌ కాకతీయను నీతి ఆయోగ్‌ ప్రశంసిస్తే.. మీకు కనిపించడం లేదా? బీజేపీ పాలిత రాష్ర్టాల మంత్రులు, అధికారులు తెలంగాణలోని పథకాలను ప్రశంసిస్తుంటే.. నడ్డాకు కనిపించడం లేదా? కాంగ్రెస్‌ నేతలు అవినీతి అంటూ కాకిగోల పెడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్య శ్రీ చాలా మెరుగైన కార్యక్రమం. పెన్లన్లపై బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని' కేటీఆర్‌ మండిపడ్డారు. 


'హైదరాబాద్‌ అభివృద్ధికి గత ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందేంటి? కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదు. టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో ఎక్కడైనా కర్ఫ్యూ పెట్టే పరిస్థితి వచ్చిందా? సంక్షేమ కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా? వ్యవసాయం, పరిశ్రమలు, గృహాలకు కరెంటు ఇస్తున్నాం. నీతి ఆయోగ్‌ మెచ్చుకున్న తెలంగాణ పథకాలపై బీజేపీ విమర్శలు చేస్తుంది. ఎగిరెగిరిపడుతున్న బీజేపీ నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని' వ్యాఖ్యానించారు.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM