ఇల్లెందులో సోలార్ పవర్ ప్లాంటు!

byసూర్య | Tue, Jun 18, 2019, 08:41 PM

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సింగరేణిలో 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను నిర్మించేందుకు అంగీకరించింది. భద్రాద్రి కొత్తగూడం జిల్లా సింగరేణికి పుట్టినిళ్లయిన ఇల్లెందులో 60 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు సింగరేణి సంస్థ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలు అంగీకరించాయి. అందులో మొదటి దశగా 150 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో ఇల్లెందు 60 మెగావాట్లు, మణుగూరు 30 మెగావాట్లు, పెద్దపల్లి 50 మెగావాట్లు, సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎస్‌టీపీపీ) 10 మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఇరు సంస్థలు అంగీకరించాయి. సింగరేణికి పుట్టినిల్లయిన ఇల్లెందులో ఆనాడే బ్రిటీష్ అధికారులు ముందుచూపుతో విద్యుత్తు ప్లాంటును నెలకొల్పారు. 1928లో 21 ఇంక్లెన్ గని సమీపంలో మొట్టమొదటి విద్యుత్తు ఉత్పత్తిని చేసే ప్లాంటును ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటు ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును బొగ్గు గనుల్లో కార్మికులు, టబ్బులు నింపే ప్రాంతాలలో వెలుగు కోసం ఉపయోగించేవారు. బ్రిటీష్‌వారు ఇండియా వదిలి వెళ్లిన తరువాత ఆ విద్యుత్తు ప్లాంటు మరుగున పడింది. ఆ తరువాత స్వాతంత్రం రావడం, ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అనేకమార్లు సింగరేణికి పురిటిగడ్డయిన ఇల్లెందులో 660 మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాలని డిమాండ్లు, ఉద్యమాలు జరిగాయి. అయినప్పటికి ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ప్లాంటు ఏర్పాటు జరుగుతుండనడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 60 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటుచేయాలంటే సుమారు 300 ఎకరాల స్థలం అవసరమని తేల్చారు. ఒక్క మెగావాటుకు 5 ఎకరాల చొప్పున 60 మెగావాట్లకు 300 ఎకరాలు స్థలం కావాల్సి ఉంటుంది. 300 ఎకరాలతో పాటు అదనంగా ఆరు ఎకరాలు మొత్తం 306 ఎకరాల స్థలాన్ని సింగరేణి సంస్థ కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. కాగా 60 మెగావాట్ల పవర్ ప్లాంటును ఏర్పాటు చేస్తే ఇల్లెందుకు మంచి రోజులు రానున్నాయి. కేవలం 1 లేదా 2 మెగావాట్ల విద్యుత్తుతో ఇల్లెందు పట్టణంతో పాటు నాలుగు దిక్కుల ఇరవై కిలోమీటర్ల మేర ఉన్న గ్రామాలకు విద్యుత్‌ను అందజేయవచ్చని సింగరేణి అధికారులు అంటున్నారు. కేవలం రెండు మెగావాట్ల విద్యుత్తుతోనే ఏడాది పొడవునా రెండోందల పల్లెలతో పాటు పట్టణానికి విద్యుత్ సరఫరా చేయవచ్చు. మిగతా 58 మెగా వాట్లు ఏదైనా విద్యుత్తు సంస్థలకు విక్రయించడమా లేదా స్టోరేజీ చేయడమా అనే దానిపై రెండు సంస్థలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏదేమైనప్పటికి ఇల్లెందుకు మంచిరోజులు వచ్చాయి. సోలార్ పవర్ ప్లాంటుతో ఏరియా భవిష్యత్తు ఆధారపడి ఉందని కార్మికులు , కార్మిక కుటుంబాలు భావిస్తున్నాయి. ఇంత వరకు ఇల్లెందు పట్టణంలో చిరు పరిశ్రమ ఉన్న దాఖలాలు లేవు. పవర్ ప్లాంటు రాకతో ఇల్లెందు పట్టణ ప్రజలు కాస్త ఊరట చెందనున్నారు.


 


Latest News
 

రెజిమెంటల్ బజార్ లో శ్రీగణేశ్ పాదయాత్ర Fri, Apr 19, 2024, 01:40 PM
దుర్గా దేవస్థానం అష్టమ కళ్యాణ వార్షికోత్సవం ఆహ్వానం Fri, Apr 19, 2024, 01:40 PM
ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం Fri, Apr 19, 2024, 01:38 PM
ప్లాస్టిక్ విక్రయ దుకాణాల్లో తనిఖీలు Fri, Apr 19, 2024, 01:38 PM
మోడీ ప్రోత్సాహంతో తెలంగాణలో వెలుగులు: ఎంపీ అభ్యర్థి శానంపూడి Fri, Apr 19, 2024, 01:27 PM