ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయానికి ఎన్నిక‌లు వేదిక‌గా....

byసూర్య | Tue, Mar 19, 2019, 08:47 PM

చ‌రిత్ర‌లో ఎన్నడూ లేనంత‌టి.. ఏ ఎన్నికలో చూడ‌ నటువంటి ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయానికి ఈ ఎన్నిక‌లు వేదిక‌గా నిలిచాయి. ఎన్నిక‌ల సంగ్రామం నుంచి దాదాపు ఒక త‌రం నేత‌లు క‌నుమ‌రుగ‌వ్వ‌డంతో.. మ‌రో త‌రం సార‌థ్యంలో జ‌రుగుతున్న ఎన్నిక‌లు ఇవి. ఇది ఏ ఒక్క పార్టీకో ప‌రిమితం కాలేదు... జాతీయ పార్టీలు మొద‌లుకుని ప్రాంతీయ పార్టీల వ‌ర‌కు అన్ని పార్టీల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఆ సీనియ‌ర్ నేత‌లు రాజ‌కీయాల నుంచి వైదొల‌గ‌డం.. అనారోగ్యంతో ఆసుప‌త్రిలో ఉండ‌టం.. చ‌నిపోవ‌డం.. కార‌ణాలు ఏవైనా సీనియ‌ర్ అనే ప‌దం లేకుండా కొత్త త‌రం మ‌ధ్య జ‌రుగుతున్న భార‌త సంగ్రామంగా 2019 ఎన్నిక‌లు నిలిచాయి. అధికార బీజేపీలో ఈ సారి పూర్తిగా ఇద్ద‌రు నేత‌లే ముందుండి ఎన్నిక‌ల సంగ్రామాన్ని న‌డిపిస్తున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా. ఈ ఇద్ద‌రే ఎన్నిక‌లను లీడ్ చేస్తున్నారు.  ఇక మాజీ ప్రధాని వాజ్‌పేయి మ‌ర‌ణంతో ఆయ‌న స‌మ‌క్షం లేకుండా జ‌రుగుతున్న దేశంలో జ‌రుగుతున్న తొలి ఎన్నిక‌లు ఇవే. 2004 వర‌కు ఆయ‌న రాజ‌కీయంగా చురుగ్గా ఉన్న‌ప్ప‌టికీ 2009,2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న బ‌తికే ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న లేకుండా జ‌రుగుతున్న ఎన్నిక‌లుగా ఇవి ముద్ర‌ప‌డ్డాయి. కాంగ్రెస్ పార్టీని 1999,2004,2009,2014లో ముందుండి న‌డిపించిన ఘ‌న‌త సోనియాగాంధీదే. నాలుగు ప‌ర్యాయాల్లో రెండుసార్లు పార్టీని అధికారంలోకి తెచ్చారు. ప్రస్తుత ఎన్నిక‌ల్లో ఆమె తిరిగి రాయ్‌బ‌రేలీ నుంచి పోటీ చేస్తున్న‌ప్ప‌టికీ అనారోగ్యం కార‌ణంగా దేశంలో ఎక్క‌డా ప్ర‌చారం చేసే ప‌రిస్థితి లేదు. ఆమె కుమారుడు, కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీనే ప్ర‌చార బాధ్య‌త‌లు భుజానికెత్తుకున్నారు. ఆయ‌న సోద‌రి ప్రియాంక‌గాంధీ కూడా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌చారం చూసుకుంటున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి పార్టీని ఏమేర‌కు విజ‌యతీరాల‌కు చేరుస్తార‌న్న‌ది ఆసక్తిక‌రంగా మారింది. జ‌బ్‌త‌క్ స‌మోసామే ఆలూ ర‌హేగా.. త‌బ్ త‌క్ బీహార్‌మే లాలూ ర‌హేగా అని ఆర్‌జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఎప్పుడు చెబుతుంటారు. జైలు శిక్ష‌, అనారోగ్యం కార‌ణంగా ఈసారి ఆయ‌న ఎన్నిక‌ల‌కు దూర‌మ‌య్యారు. ప్ర‌చారం కూడా చేయ‌లేని ప‌రిస్థితి. మూడున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత లాలూ లేని ఎన్నిక‌ల‌ను బీహార్ చూడ‌బోతోంది. ఆయ‌న త‌న‌యుడు తేజ‌స్వియాద‌వ్ పార్టీని న‌డిపిస్తున్నారు. అయిదు ద‌శాబ్దాల‌ పాటు త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను శాసించారు క‌రుణానిధి. డీఎంకే పార్టీ అధ్య‌క్షుడిగా ఆయ‌న త‌మిళ రాజ‌కీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే చెర‌గ‌ని ముద్ర వేశారు. ఆయ‌న గ‌తేడాది అస్త‌మించ‌డంతో.. క‌రుణానిధి లేని ఎన్నిక‌ల‌ను తొలిసారిగా త‌మిళ రాజ‌కీయం చూడ‌బోతోంది. ఆయ‌న త‌న‌యుడు డీఎంకే అధ్య‌క్షుడు స్థాలిన్.. ఇప్పుడు పార్టీ బాధ్య‌త‌లు చూస్తున్నారు. త‌మిళ‌నాడు మ‌రో నాయ‌కురాలు లేకుండా ఎన్నిక‌లకు వెళ్లోతోంది. మూడు ద‌శాబ్దాల‌పాటు త‌మిళ‌నాట చ‌క్రం తిప్పుతున్నారు జ‌య‌ల‌లిత‌. ఆమె ఏడాదిన్న‌ర కింద‌ట మృతి చెంద‌డంతో అన్నాడీఎంకే చుక్కాని లేని నావ‌లా త‌యారైంది. ఆమె లేకుండానే ఈ ఎన్నిక‌ల‌కు ఆ పార్టీ వెళ్ల‌బోతోంది. ఒక‌ప్పుడు అన్నాడీఎంకే వైపే క‌న్నెత్తి చూసేందుకు భ‌య‌ప‌డే బీజేపీ.. ఇప్పుడు అదే పార్టీతో జ‌ట్టు క‌ట్టిందంటే జ‌య‌ల‌లిత లేని లోటు ఎంత‌గా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. తెలంగాణ‌లోనూ తెరాస అధ్య‌క్షుడు కేసీఆర్ ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టికీ.. లోక్‌స‌భ ఎన్నిక‌ల బాధ్య‌త పూర్తిగా ఆయ‌న త‌న‌యుడు,పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ భుజాల‌కెత్తుకున్నారు. ఈ ఎన్నిక‌లో పార్టీ అనుకున్న‌ట్లుగా 16 స్థానాల్లో విజ‌యం సాధిస్తే కేటీఆర్‌కే ఆ క్రెడిట్ ద‌క్కుతుంది.


 


 


 


 


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM