థ్రిల్లర్ సినిమాగా ఎవరు రివ్యూ

by సూర్య | Thu, Aug 15, 2019, 08:17 PM

అడవి శేషు.. మన సినీ యువతరంలో ప్రత్యేకమైన శైలిని సృష్టించుకున్న నటుడు. స్క్రీన్ ప్లే రైటర్ గా, నటుడిగా తనకంటూ ఓ దారిని తయారుచేసుకుని దానిలో విజయవంతంగా ముందుకు సాగిపోతున్నాడు. క్షణం, గూఢచారి వంటి సినిమాలతో ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఒక ఇమేజిని సృష్టించుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఎవరు అంటూ పలకరించాడు ప్రేక్షకుల్ని. థ్రిల్లర్ సినిమాగా ఎవరు రూపుదిద్దుకుంది. 
ఛాయాగ్ర‌హ‌ణం: వ‌ంశీ ప‌చ్చిపులుసు, సంగీతం: శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌, క‌ళ‌: అవినాష్ కొల్ల‌, కూర్పు: గ్యారీ బి.హెచ్‌, సంభాష‌ణ‌లు: అబ్బూరి ర‌వి, నిర్మాత‌లు: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ రాంజీ, విడుదల: 15-08-2019, సంస్థ‌: పీవీపీ సినిమా,న‌టీన‌టులు: అడివిశేష్‌, రెజీనా, న‌వీన్ చంద్ర, ముర‌ళీ శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్ త‌దిత‌రులు, విమర్శకుల రేటింగ్ 3.5 / 5, వీక్షకుల సరాసరి రేటింగ్:3.5 / 5,
‘ఎవరు’ అనే ప్రశ్నతో మొదలైన కథకు చిక్కుముడులు విప్పే కథనమే అడివి శేష్ నటించిన తాజా చిత్రం ‘ఎవరు’. కంటెంట్ ఉన్న కథలో ట్విస్ట్‌లు ఉంటే సినిమా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. కాని సీన్‌ సీన్‌కి ట్విస్ట్ ఉండి.. ఆ ట్విస్ట్ కన్వెన్సింగ్‌‌గా ఉంటే అందులో ఉండే మజానే వేరు. క్షణం, గూఢచారి చిత్రాలతో అడివి శేష్ సినిమాలంటే ఏదో విషయం ఉంటుందబ్బ.. అనే పాజిటివ్ వైబ్రేషన్స్‌ను ఆడియన్స్‌లో ఉండనే ఉంది. ఇక ‘ఎవరు’ టీజర్, ట్రైలర్‌లతో ఇదేదో చూడాల్సిన సినిమాలానే ఉందనిపించిన అడివి శేష్ మరోసారి ప్రశంసలకు అర్హుడయ్యాడు. సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప.. ప్రీమియర్ షోలు వేయరు. కాని ‘ఎవరు’ చిత్రం విడుదలకు ముందే వేయి మందికిపైగా జనరల్ ఆడియన్స్‌కి చూపించి మరీ సినిమా విడుదల చేశారంటే ‘ఎవరు’ దమ్మున్న కథే అని ఓ అంచనాకు వచ్చేయొచ్చు. ఈ అంచనాల్ని నిజం చేసింది ‘ఎవరు’. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం.. ఆడియన్స్‌ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తరువాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు.. వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ‘ఎవరు’ చిత్రంతో ఇదే మ్యాజిక్ చేశాడు దర్శకుడు వెంకట్ రామ్ జీ. ,
‘ఎవరు’ సినిమా ప్రశ్నలతోనే మొదలౌతోంది. ఈ రేప్ మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్లే కొలదీ థ్రిల్లింగ్ ట్విస్ట్‌లు, సర్ ప్రైజ్‌లు, ప్రశ్నలు, సమాధానాలతో కథ సాఫీగా సాగిపోతుంది. ఊహించని మలుపులతో చిక్కుముడులనే పెట్టుబడిగా ‘ఎవరు’ కథను మలిచారు. క్యారెక్టర్స్ మధ్య నడిచే సంభాషణలతో కథను రివీల్ చేసి డీసెంట్‌గా డీల్ చేశాడు దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్స్‌కి కథ కొసరంతే ఉన్నా.. కథనంతో ఫుల్ మీల్స్ అందిస్తుంటాయి. ఈ ‘ఎవరు’ కథ కూడా ఈ కోవలోనిదే. కథ మొత్తం స్క్రీన్ ప్లే మాయాజాలంతో సాగుతుంది. ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే.. ఓ సాప్ట్ వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే మధ్య తరగతికి చెందిన సమీరా (రెజీనా).. ఆ కంపెనీ బాస్‌కి నచ్చడంతో అతనితో పెళ్లికి సిద్ధపడుతుంది. అయితే ఆ బాస్‌తో ఆమెకు శారీరక సంబంధం లేకపోవడంతో.. తన స్నేహితుడైన పోలీస్ ఉన్నతాధికారి అశోక్ (నవీన్ చంద్ర)తో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ సమీరాపై అత్యాచారం జరగడం.. అక్కడే అశోక్ హత్య చేయబడటం జరుగుతుంది. ఈ హత్య, అత్యాచారం ఎలా జరిగింది? ఎవరు చేశారన్నదే కథలో ట్విస్ట్. మరోవైపు కూనూర్ ప్రాంతంలో రిసార్ట్స్ నిర్వహించే వినయ్ వర్మ (మురళీ శర్మ) కనిపించకుండా పోతారు. అతన్ని వెతుక్కుంటూ క్యాన్సర్‌తో బాధపడే ఆయన కొడుకు రాహుల్ (నిహాల్) పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటాడు. అదే స్టేషన్‌లో ఎస్‌.ఐగా పనిచేస్తుంటాడు విక్రమ్ వాసుదేవ్ (అడివి శేష్). డబ్బు ఇస్తే ఎలాంటి పనినైనే చేసే లంచావతారం విక్రమ్ వాసుదేవ్.. వినయ్ వర్మ కేసును డీల్ చేయడానికి రాహుల్ దగ్గర లంచం తీసుకుంటాడు. ఈ కేసుకి సమీరా కేసుకి లింకేంటి? అసలు విక్రమ్ వాసుదేవ్ ‘ఎవరు’? వినయ్ వర్మ ‘ఎవరు’? రాహుల్ ‘ఎవరు’? సమీరాని రేప్ చేసింది ‘ఎవరు’? అశోక్‌ని హత్య చేసింది ‘ఎవరు’? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ‘ఎవరు’? చిత్రం. 
రొటీన్ కమర్షియల్ ఫార్ములా చిత్రాల్లో హీరో క్యారెక్టరైజేషన్‌కి బిల్డప్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే అడివి శేష్ చిత్రాల్లో అతని క్యారెక్టరైజేషన్ కాస్త భిన్నంగా ఉంటుంది. హీరో క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి అనవసరమైన హంగామా చేయకుండా సింపుల్‌గా కథలోకి ఎంటర్ అయిపోతుంటాడు. ఫైట్లు, ఫీట్లు, యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సన్నివేశాలను టచ్ చేయకుండానే ఈ సినిమాలో హీరోయిజం పండించాడు. కరెప్టెడ్ ఎస్. ఐ‌గా అదరగొట్టాడు. అడివి శేష్‌లోని నటుడు మాత్రమే కాకుండా అతనిలోని రైటర్‌ ‘ఎవరు’ కథకు బాగా హెల్ప్ అయ్యింది.,
ఈ సినిమాలో హీరోయిన్‌గా రెజీనా నటించినా.. ఆమె సినిమాకి మాత్రమే హీరోయిన్. కథలో హీరోకి హీరోయిన్ లేదంటే కథపై దర్శకుడికి ఎంత పట్టు ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇద్దరి మధ్య పాటలు, రొమాంటిక్ సీన్లు, ముద్దు, ముచ్చట్లు అంటూ రన్ టైం గడిపేయకుండా మిస్టరీని మెయింటైన్‌ చేస్తూ కథను నడిపించారు. 
ఈ చిత్రంలో కీలకమైన రెజీనా రేప్ సీన్‌ను మూడు కోణాల్లో చూపించాడు దర్శకుడు. ఒక్కోసారి ఒక్కో ప్రశ్నకు చిక్కుముడి వీడుతుంది. ఈ మూడు సీన్స్‌కి భిన్నమైన నేపథ్యం ఉంటుంది. కథ డిమాండ్ చేయడంతో దర్శకుడు రెజీనాలోని గ్లామర్‌ యాంగిల్‌ని కూడా ఉపయోగించుకున్నాడు. నవీన్ చంద్రతో రొమాన్స్, లిప్ లాక్స్ హద్దులు మీరినట్టుగా అనిపించినా కథకు బలాన్నివిగా మలిచారు. 
నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్‌గా ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆకట్టుకున్నారు. రెజీనాతో రొమాంటిక్ సన్నివేశాల్లో తనలోని రొమాంటిక్ నటుడ్ని మేలుకొలిపాడు. జగడం సినిమాలో రామ్ తమ్ముడిగా నటించిన నిహాల్ ఈ సినిమాలో క్యాన్సర్ పేషెంట్‌గా అద్భుతంగా నటించారు. కథలో కీలకమైన రోల్ పోషించారు. ఎమోషనల్ సన్నివేశాలను చాలా ఈజీగా క్యారీ చేసి కంటతడి పెట్టించాడు. క్లైమాక్స్ ట్విస్ట్‌తో ఈ పాత్రకు హైప్ వచ్చింది. కథలో కీలకమైన వినయ్ వర్మ పాత్రలో మురళీశర్మ మరోసారి ఆకట్టుకున్నారు. ఆయనకు భార్యగా నటించిన పవిత్ర లోకేష్ తన పరిధిమేర పాత్రకు న్యాయం చేసింది. ఇక వరుసగా ఐదోసారి అడివి శేష్‌తో సినిమా చేసిన నిర్మాత పీవీపీ మరోసారి ఎమ్‌వీపీ (మోస్ట్ వాల్యుబుల్ ప్లే) అనిపించారు. కథను నమ్మి కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చి అందులోని హిట్ ఫ్లేవర్‌ని ముందే పసిగట్టారు. ఇక ప్రతి సినిమా మాదిరి ఇందులోనూ రంధ్రాన్వేషణ చేస్తే.. ఫస్టాఫ్‌లో ఉన్నంత గ్రిప్పింగ్ సెకండాఫ్‌లో కాస్త తగ్గుతుంది. ఇంటర్వెల్‌‌ సీన్‌‌తో కథ రసకందాయంలో పడుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించినా అక్కడక్కడా లాజిక్‌లు మిస్ అయినట్టు కనిపిస్తాయి. కామెడీ, మసాలాలు లేకపోవడం లోటే కాని.. బీ సీ సెంటర్లలలో ఆడియన్స్‌ని ఆకట్టుకోవాలంటే అవి తప్పనిసరే. ఇక మల్టీప్లెక్స్ ప్రేక్షకులు ఆసక్తిగా ఈ సీరియస్ కథను ఆస్వాదిస్తారు కాని.. మరీ ఇంత సీరియస్ స్క్రీన్ ప్లేని మాస్ ఆడియన్స్ సీన్ టు సీన్ ఫాలో కావడం ఆ లాజిక్‌లు, మ్యాజిక్‌లను ఎక్కించుకోవడం కాస్త కష్టమే. అయితే రొటీన్ మూస చిత్రాలకు పెద్ద రిలీఫ్ ఈ ‘ఎవరు’ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM