by సూర్య | Wed, Sep 18, 2024, 05:50 PM
తాను నటించిన ‘మెయ్యళగన్’ (తెలుగులో సత్యం సుందరం) ఒక్క యాక్షన్ సన్నివేశం లేని పక్కా కమర్షియల్ చిత్రమని హీరో కార్తీ అన్నారు. 2డి ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతిక దంపతులు కలిసి నిర్మించారు. ‘96’ ఫేం ప్రేమ్‌కుమార్ దర్శకుడు. సీనియర్ నటులు అరవింద్ స్వామి, రాజ్‌కిరణ్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీదివ్య హీరోయిన్‌గా ఇతర పాత్రల్లో దేవదర్శిని, జేపీ తదితరులు నటించారు. ఈ నెల 27న సినిమా విడుదల నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ, ‘ఈ స్క్రిప్టు చదివేటపుడే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ప్రతి ఒక్కరికీ ఒక తపన ఉంటుంది. దీపావళి, సంక్రాంతి ఇలా ముఖ్యమైన పండుగలకు తమతమ సొంతూళ్ళకు వెళ్తారు. ఆ సమయంలో చెన్నై నగరం బోసిబోయి కనిపిస్తుంది. అలాంటి ఒక మంచి కథ. ఈ సినిమా అంతా అరవింద్ స్వామిని హింసించే పాత్ర’ అని అన్నారు. అనంతరం అరవింద్ స్వామి మాట్లాడుతూ, ‘ఇందులో నన్ను దృష్టిలో ఉంచుకుని నా పాత్ర రాసిన దర్శకుడికి ధన్యవాదాలు. ఇది నా జీవిత కథ. ఈ స్టోరీ నన్ను అంతలా ప్రభావితం చేసింది. సినిమా విడుదలైన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతాను. కార్తీతో షూటింగ్ సమయంలోనే కాదు.. నిజ జీవితంలోనూ మంచి సంబంధాలున్నాయన్నారు. దర్శకుడు ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ, ‘96’ చిత్రం తర్వాత ఇపుడే మీడియా ముందుకు వచ్చాను. గత యేడాది నవంబరు నెలలో షూటింగ్ ప్రారంభించి, సెప్టెంబరులో అంటే ఒక యేడాది కాలంలోనే రిలీజ్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విద్వేషపూరిత కామెంట్స్ పెరిగి పోతున్నాయి. వీటికి ప్రేమ ఫుల్‌స్టాఫ్ పెడుతుంది. ఈ చిత్రం ప్రేమను పంచే మూవీ అన్నారు. క్రమంగా తమిళ భాష మన నుంచి దూరమైపోతుందని అందుకే ఈ మూవీ టైటిల్ నుంచి ప్రతి విషయంలోనూ తమిళంకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఆ తర్వాత హీరోయిన్ శ్రీదివ్య, సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ ఇతర టెక్నీషియన్లు ప్రసంగించారు.
Latest News