by సూర్య | Sun, Sep 15, 2024, 02:59 PM
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) SIIMA 2024 వేడుకలు శనివారం దుబాయిలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి దసరా, బేబీ, హాయ్ నాన్న చిత్రాలు వరుస అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి.దసరా కుగానూ ఉత్తమ నటుడిగా నాని అవార్డ్ దక్కించుకున్నారు. అయితే ఈ అవార్డును టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా అందించారు. ఈ పురస్కారం ఇచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నానితో కలిసి పనిచేసిన ఎవడే సుబ్రహ్మణ్యం షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో యాక్టింగ్ పరంగా నాని తనకు చాలా సాయం చేశారని.. అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. ఇకపై నానీని అన్నా అనే పిలుస్తానంటూ చెప్పుకొచ్చారు.
“ఎవడే సుబ్రహ్మణ్యం లో మొదటిసారి నేను కీలకపాత్ర పోషించాను. ఈ మూవీకి ఆడిషన్ ఇచ్చేందుకు నాని ఆఫీస్ కు వెళ్లాను. ఆయనతో ఆడిషన్ అని తెలిసి ఎంతో సంతోషపడ్డాను. అలాగే కాస్త కంగారుపడ్డాను కూడా. నటీనటులు ఎవరికైనా తొలి చిత్రం ఎప్పటికీ గుర్తు ఉంటుంది. ఎన్నో మధుర జ్ఞాపకాలు అందిస్తుంది. ఆ సమయంలో నాని చాలా సపోర్ట్ చేశారు. నానీ ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.. నీపై నాకు అమితమైన గౌరవం, ప్రేమ ఉన్నాయి. నేను ఇండస్ట్రీలోని అందరినీ అన్నా.. అన్నా అని పిలుస్తుంటాను.. కానీ ఎందుకు పిలుస్తున్నానో నాకే తెలియదు. ఇక ఈరోజు నుంచి నిన్ను నాని అన్నా అని పిలుస్తాను. నువ్వు వరుస విజుయాలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నీకు అవార్డ్ అందించడం కూడా ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు. విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
అనంతరం నాని మాట్లాడుతూ.. “విజయ్ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. మేమిద్దరం కలిసి వర్క్ చేసినప్పుడు గురించి చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఎప్పుడూ ఏదో ఆకటి నేర్చుకోవాలనే తపన ఉన్న వ్యక్తి అతడు. వచ్చే ఏడాది ఇదే స్టేజ్ పై మా గౌతమ్ తిన్ననూరి కు నేను అవార్డ్ ఇస్తాను.. నువ్వు ఫిక్స్ అయిపో” అంటూ చెప్పుకొచ్చారు. నాని, విజయ్ దేవరకొండ కలిసి ఎవడే సుబ్రహ్మణ్యం లో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మాళవిక నాయర్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల జరిగిన బాలకృష్ణ 50 ఏళ్ల నట వేడుకలలోనూ నాని, విజయ్ స్టేజి మీద హగ్ చేసుకుని మాట్లాడారు.
Latest News