by సూర్య | Fri, Sep 13, 2024, 08:01 PM
సినిమా: మత్తువదలరా 2తారాగణం: శ్రీసింహా, సత్య, వెన్నెల కిశోర్, ఫరియా అబ్దుల్లా..
సంగీతం: కాలభైరవ
కెమెరా: సురేశ్ సరంగం
రచన, దర్శకత్వం: రితేశ్ రాణా
నిర్మాతలు: మైత్రీమూవీమేకర్స్, చిరంజీవి(చెర్రీ), హేమలత..
తొలిభాగం విజయవంతమైతే.. దానికి సీక్వెల్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం 'మత్తువదలరా 2' విషయం అదే జరిగింది. షూటింగ్‌ని గప్‌చిప్‌గా కానిచ్చేసిన ఈ బృందం, విడుదలకు ఇరవైరోజుల ముందు సినిమాకు సంబంధించిన తొలి ప్రకటన చేశారు. దాంతో ఒక్కసారిగా 'మత్తువదలరా 2' ఎక్కడలేని బజ్ వచ్చేసింది. మరి తొలి భాగం మాదిరిగానే జనాన్ని ఈ మలి భాగం మెప్పించిందా? లేదా అనేది తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ : బాబూమోహన్ (శ్రీసింహా), యేసు (సత్య).. ఇద్దరికీ డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు ఊడటంతో రోడ్డుమీద పడతారు. ఎన్నో అష్టకష్టాలకోర్చి మొత్తానికి హై ఎమర్జెన్సీ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్స్‌గా ఉద్యోగాలు సంపాదిస్తారు. కిడ్నాపుల్ని ఛేదించడం, నిందితుల్ని పట్టుకోవడం వీళ్ల పని. ఆ పనిలో ఇద్దరూ పూర్తిగా ఆరితేరిపోతారు. జీతం డబ్బులతో బతకడం కష్టమై, అప్పుడప్పుడు చేతివాటం ప్రదర్శిస్తూ.. కొద్ది మొత్తంలో డబ్బుని కూడా తస్కరిస్తూ.. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతుంటారు. కొన్ని రోజులకు వాళ్లు చేస్తున్న పనిపై వాళ్లకే చిరాకేస్తుంది. 'ఈ అరాకొరా ఆదాయంతో ఎన్నాళ్లు బతకడం.. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి' అని నిశ్చయించుకున్నారు. సరైన సమయంలో రెండుకోట్ల లావాదేవీలతో ముడిపడిన ఓ కిడ్నాప్ కేసు వీళ్ల దగ్గరకి వస్తుంది. ఆ కేసును అడ్డం పెట్టుకొని ఎలాగైనా ఆ రెండు కోట్లు కొట్టేయాలనే ప్లాన్‌తో రంగంలోకి దిగుతారు. అయితే.. ఆ కిడ్నాప్‌కి గురైన యువతి అనూహ్యంగా వీళ్ల కారులోనే శవమై కనిపిస్తుంది. ఈ దారుణం చేసిందే వీళ్లే అని రుజువు చేసేలా ఓ వీడియో కూడా బయటపడుతుంది. ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? అసలు ఆ చనిపోయిన అమ్మాయి ఎవరు? ఈ కేసు నుంచి ఇద్దరూ ఎలా బయపడ్డారు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ : సీక్వెల్ అనగానే తొలి భాగంతో పోల్చి చూడటం ఆడియన్స్‌కి పరిపాటే. అందుకే సీక్వెల్‌పై దర్శకులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే, తొలి భాగంతో పోల్చి చూస్తే అన్ని రకాలుగా తక్కువగానే అనిపిస్తుంది. అయితే, కొన్ని విషయాల్లో మాత్రం సినిమా ఆకట్టుకుంటుంది. ట్రెండుకు తగ్గట్టుగా దర్శకుడి చిత్రీకరణ, సత్య కామెడీ, సాంకేతిక పనితనం.. ఇవన్నీ సినిమాను నిలబెట్టాయి. బాబుమోహన్, యేసు డబ్బుకోసం పథకాలు రచించడం, వాటివల్ల చిక్కుల్లో పడటం. వాటినుంచి తప్పించుకునేందు వాళ్లు పడే పాట్లు. తద్వారా ఉత్పన్నమయ్యే హాస్యం ఇవన్నీ సినిమాను సక్సెస్ చేశాయని చెప్పొచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచింది. హత్య కేసు నుంచి వీరిద్దరూ ఎలా బయట పడ్డారు? దీనికోసం వీరు చేసిన ప్రయత్నాలేంటి? అనే విషయంపై ఇన్విస్టిగేషన్ డ్రామాగా ద్వితీయార్థం మొత్తం సాగింది. ఈ కారణంగా సినిమా సీరియస్ రంగు పులుముకుంది. దాంతో కామెడీ అటకెక్కింది. మొత్తంగా పంచ్ డైలాగులు, సత్య చేసిన సందడి, అక్కడక్క అగ్ర హీరలో సినిమాకు సంబంధించిన రిఫరెన్సులు ఇవన్నీ ఆడియన్స్‌కి పట్టేస్తాయి. ఎక్కడా లాజిక్కులు ఉండావ్. ఈ తరహా సినిమాలకు లాజిక్కులు వెతకడం కూడా సబబుకాదు.
నటీనటుల నటన
శ్రీసింహా చాలా ఈజ్‌తో నటించాడు. తన పాత్రకు చక్కగా న్యాయం చేశాడు. ఇక సత్య కామెడీనే ఈ సినిమాకు ప్రధానబలం. అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో సినిమాను నిలబెట్టాడు సత్య. హీ-టీమ్ సబ్యురాలిగా నటించిన ఫరియా అబ్దుల్లా కూడా కామెడీతో నవ్వించింది. ఇందులో ఆమె యాక్షన్ సీన్స్‌తో కూడా ఆకట్టుకుంది. ఇంకా రోహిణి, సునీల్, వెన్నెలకిశోర్, అజయ్ కీలక పాత్రల్లో మెరిశారు.
సాంకేతికంగా : సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా బావుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్, కాలభైరవ నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి. ముఖ్యంగా సురేశ్ సరంగం సినిమాటోగ్రఫీ అభినందనీయంగా ఉంది. దర్శకుడు రితేష్ మాటలు కూడా నవ్వించాయి. అయితే.. కథ, కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే బావుండేది అనిపించింది. మొత్తంగా కామెడీ సినిమాలను ఇష్టపడే వాళ్లకు 'మత్తువదలరా 2' నచ్చేయొచ్చు.
బలాలుసత్య కామెడీ, డైలాగులు, నేపథ్య సంగీతం
బలహీనతలు
ద్వితీయార్ధంలో కామెడీ లోపం, కథనం
Latest News