by సూర్య | Fri, Sep 13, 2024, 07:37 PM
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆధునిక టెక్నాలజీ ప్రజలకు ఎంతగా ఉపయోగపడుతుందో..అదే స్థాయిలో ప్రమాదకరంగాను మారింది. నెట్టింట ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సందే. ఎందుకంటే అప్పుడప్పుడు హ్యాకర్లు, సోషల్ మీడియా ఖాతాలను తమ అధీనంలోకి తీసుకుంటారు. ముఖ్యంగా సెలబ్రెటీస్ ఖాతాలు ఎక్కువగా హ్యాక్ అవుతుంటాయి. ఇటీవలే బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయినట్లు చెప్పాడు. ఇక ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ ట్వీట్ చేసింది.నిజానికి ఇప్పుడిప్పుడే నయన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కొన్ని రోజుల క్రితమే ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ చేసిన ఈ హీరోయిన్.. వరుసగా తన భర్త, పిల్లలతో కలిసి గడిపే క్షణాలను పోస్ట్ చేస్తుంది. ముఖ్యంగా తన కొడుకులు ఇద్దరితో కలిసి గడిపే సమయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. కానీ ట్విట్టర్ లో మాత్రం ఎప్పుడో ఒకసారి పోస్టులు చేస్తుంది. తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని ట్వీట్టర్ లోనే రాసుకొచ్చింది. తన అకౌంట్ నుంచి ఎవరైనా మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వొద్దని పేర్కొంది. దీంతో ప్రస్తుతం నయన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. ఆగస్ట్ 2013లో ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన నయనతారకు ప్లాట్‌ఫారమ్‌లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
నయనతార చివరిసారిగా జవాన్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సరసన నటించింది. ఈ మూవీలోనే నయన్ హిందీలో అరంగేట్రం చేసింది. ఇందులో నయనతార ఒక సాహసోపేతమైన NSG అధికారిణి అయిన నర్మదా రాయ్‌గా నటించింది. జవాన్ చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. అలాగే అటు కాస్మోటిక్ వ్యాపారరంగంపై మరింత ఫోకస్ చేసింది.
Latest News