ఏపీలో అదానీ పెట్టబడులు...భారీగా ఉద్యోగాల కల్పన

by సూర్య | Thu, Jun 23, 2022, 02:59 PM

అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ శ్రీసత్యసాయి జిల్లాలోని చిత్రావతి, వైఎస్‌ఆర్‌ జిల్లాలోని గండికోట, పార్వతీపురం మన్యం జిల్లా కురుకుట్టి, కర్రివలసలలో 3,700 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టుల (పీఎస్‌పీ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటి ద్వారా రూ.15,376 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 4 వేల మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రతిపాదించింది. 2022-23లో రూ.1,349 కోట్లు, 2023-24లో రూ.6,984 కోట్లు, 2024-25లో రూ.5,188 కోట్లు, 2025-26లో రూ.1,855 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ నాలుగు దశల్లో ప్రాజెక్టులను పూర్తిచేయనుంది. అలాగే కొప్పర్తిలో 1,200 ఎకరాల్లో మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌, అపారెల్‌ పార్కు ఏర్పాటుకు ఆమోదం లభించింది.


ఇదిలావుంటే వైసీపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌ కు కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. రాష్ట్రంలో రూ.16,076.48 కోట్ల పెట్టుబడులతో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 11 వేల మందికి ప్రత్యక్షంగా, 2,700 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు-ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, టూరిజం శాఖ మంత్రి ఆర్‌కే రోజా, సీఎస్‌ సమీర్‌శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 30 వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు 90 వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని తెలిపారు. భూములిచ్చిన రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.30 వేల చొప్పున లీజు అందుతున్నారు. ఈ విధానం వల్ల వర్షాభావ ప్రాంతాల రైతులకు స్థిర ఆదాయం చేకూరుతుందని పేర్కొన్నారు. సుబాబుల్‌, జామాయిల్‌ వంటి పంటలు సాగు చేస్తున్న రైతులు కూడా తమ భూములను గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు ఇస్తే లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌, పర్యాటక, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులకు అనువైన పరిస్థితి ఉందన్నారు. పారిశ్రామిక పార్కులకు రైల్వేలతో అనుసంధానం చేస్తే రవాణాకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.


తిరుపతిలో నోవోటెల్‌ బ్రాండ్‌ కింద వీవీపీఎల్‌ సంస్థ రూ.126.48 కోట్లతో హోటల్‌ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 2,700 మందికి ఉపాధి లభిస్తుంది. పంక్చుయేట్‌ వరల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కొప్పర్తి, పులివెందులలో దుస్తుల తయారీ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఒక్కోచోట రూ.50 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టనుండగా మొత్తంగా 4,200 మందికి ఉపాధి లభిస్తుంది. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ వారు రొయ్యల శుద్ధి పరిశ్రమ పెట్టనున్నారు. దీని ద్వారా 2,500 మందికి ఉపాధి లభిస్తుంది.

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM