ఇక అలా చేస్తే కోర్టు దిక్కరణనే: ఏపీ హైకోర్టు స్పష్టీకరణ

by సూర్య | Thu, Jun 23, 2022, 02:55 PM

ఏపీ సర్కార్ తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎడపెడ కేసుల ఉపసంహరణ సరికాదని, ఇది కోర్టు దిక్కారణ కిందకే వస్తుందని కోర్టు పేర్కొంది. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులను ఇష్టానుసారం ఉపసంహరించుకుంటే కుదరదని, అది కోర్టు ధిక్కరణే అవుతుందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉపసంహరణకు పెండింగులో ఉన్న అన్ని కేసుల్లోనూ స్టే ఇస్తామని హెచ్చరించింది. 


అంతేకాదు, కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని హోంశాఖను ఆదేశిస్తూ విచారణను మూడు వారాలు వాయిదా వేసింది. హైకోర్టు అనుమతి లేకుండా మాజీ, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత కుదరదని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఈ హెచ్చరికలు జారీ చేసింది.


జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న మొత్తం పది కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవో ఇవ్వగా, దానిని సవాలు చేస్తూ ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇదిలావుంటే ఉదయభానుతోపాటు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విడదల రజిని, మల్లాది విష్ణు, గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి, జక్కంపూడి రాజా, ఎంవీ ప్రతాప్ అప్పారావు, టీటీడీ చైర్మన్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ నేతలు సీహెచ్ ద్వారకారెడ్డి, విరూపాక్ష‌ి జయచంద్రారెడ్డిపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవోలు ఇచ్చింది.


16 సెప్టెంబరు 2020 నుంచి 25 ఆగస్టు 2021 మధ్య రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులపై ఎన్ని కేసుల ఉపసంహరణకు జీవోలు ఇచ్చారనే వివరాలను పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ వ్యాజ్యంతోపాటు కృష్ణాంజనేయులు దాఖలు చేసిన పిల్ కూడా నిన్న విచారణకు వచ్చింది. 


ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ తన వాదనలు వినిపిస్తూ.. డీజీపీ సూచనతోనే ఉదయభానుపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. హోంశాఖ తరపున మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసుల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభించాం తప్పితే తుది దశకు చేరుకోలేదని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేస్తూ.. విచారణను మూడు వారాలపాటు వాయిదా వేసింది.

Latest News

 
గుడిపూడి శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలి Tue, Jul 05, 2022, 12:20 PM
ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు Tue, Jul 05, 2022, 12:06 PM
అనంతపురంలో గజదొంగ పట్టివేత Tue, Jul 05, 2022, 12:02 PM
తిరుమలేశునికి రికార్డు స్థాయి ఆదాయం Tue, Jul 05, 2022, 11:57 AM
స్పందనలో హెచ్చరికలు జారీ చేసిన ఎస్పీ Tue, Jul 05, 2022, 11:52 AM