అలా వేలం వేయడం వ్యాపారం చేయడం కిందకే వస్తుంది: ఏపీ హైకోర్టు

by సూర్య | Wed, Jun 22, 2022, 04:55 PM

రాజీవ్‌ స్వగృహ పథకం ద్వారా మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన స్థలాన్ని.. బహిరంగ వేలం వేయడమంటే రాష్ట్ర ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం అవుతుందని ఏపీ హైకోర్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ తరహా వ్యాపారం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆ భూముల వేలంపై స్టే ఇస్తున్నామని హైకోర్టు వెల్లడించింది.  రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది.


విశాఖపట్నం జిల్లా ఎండాడ గ్రామ పరిధిలో రాజీవ్‌ స్వగృహ పథకం కింద ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన భూముల్ని ఏపీ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వేలం వేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. భూముల వేలం ఏంటని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. వేలం వేస్తున్న భూమిని 22,264 చదరపు గజాలుగా పేర్కొనడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అది దాదాపు 5 ఎకరాలు ఉంటుందని, దాని విస్తీర్ణాన్ని ప్రజల ఆలోచనలో తక్కువగా చూపడం కోసం చదరపు గజాలుగా చూపుతున్నారా అని ప్రశ్నించింది. ఈ నెల 30వ తేదీన జరగాల్సిన వేలం ప్రక్రియను నిలుపుదల చేసింది.


విశాఖపట్నం జిల్లా ఎండాడ గ్రామం సాగరిక టౌన్‌షిప్‌ పరిధిలోని 22,264 చదరపు గజాల ఓపెన్‌ ప్లాట్లు ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించేందుకు ఏపీ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మే 5వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వేలం ప్రకటనను సవాల్ చేస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ నేపథ్యంలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన స్థలాన్ని వేలం వేయడం చట్ట విరుద్ధమని తెలిపారు.


ఇదిలావుంటే పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ ఎండీ, వేలం నిర్వహించనున్న సంస్థ ఎంఎస్‌టీఎస్‌ ఎండీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే, తదుపరి విచారణను జూలై 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.


ప్రజలకు సముచిత ధరల్లో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు 2007లో అప్పటి ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని.. ఈ పథకం అమల్లో భాగంగా 2009లో ఎండాడ గ్రామ పరిధిలో 54.17 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇందులో 22,264 చదరపు గజాల భూమిని ఆన్‌లైన్‌ ద్వారా వేలం వేసేందుకు స్వగృహ కార్పొరేషన్‌ ప్రకటన ఇచ్చిందని.. ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలని పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం.. యథాతథ స్థితి (స్టేటస్‌ కో) పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM