కనుమ పండుగ విశిష్టత..!

by సూర్య | Sun, Jan 16, 2022, 11:36 AM

కొత్త సంవత్సరం మొదలయింది అంటే చాలు వెంటనే సంక్రాంతి పండుగే గుర్తుకొస్తుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆతురతతో ఎదురుచూస్తుంటారు. పెద్ద పండుగ రానే వచ్చింది. భోగితో మొదలయ్యే ఈ పండుగను నాలుగురోజులపాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ.. ఇలా నాలుగురోజుల పండుగకు పల్లెలు ఎంతో శోభాయమానంగా ముస్తాబవుతాయి.


జనాలు కాంక్రీటు పట్టణాలను వదిలి.. పండుగల కోసం పల్లెల బాటపడతారు. అందుకే సంక్రాంతి అంటే.. పల్లెల్లో జరుపుకునే అతిపెద్ద పండుగ అని అందరూ భావిస్తారు.. కానీ నిజానికి ఈ పండుగ వెనుక ఉన్న ప్రాముఖ్యత చాలా కొద్దిమందికే తెలుసు. సంక్రాంతినే పెద్ద పండుగ అని ఎందుకంటారు ? దీనివెనకున్న ఆంతర్యమేమిటో మనమూ తెలుసుకుందాం !


సంక్రాంతి అంటే.. తెలుగు ప్రజల పెద్ద పండుగ


ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖ మన్యం పల్లెలల్లో ఈ పండుగ శోభ కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రంగురంగుల రంగవల్లులు, కొత్తబట్టలు, భోగిపళ్లు, గొబ్బెమ్మలు, పిండివంటలు, గంగిరెద్దులు, డూడూ బసవన్నలు, కోడి పందాలు, హరిదాసులు ఇలా సంక్రాంతి పెద్ద కళే తీసుకొస్తుంది పల్లెటూళ్లకు. సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు.


భోగిమంటలతో పండుగ సంబరాలు:


భోగి పండుగతో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. ముఖ్యంగా భోగిరోజు వేకువజామునే భోగిమంటలు వేసి.. ఆ మంటల్లో పాత వస్తువుల్ని వేయడం అనాదిగా వస్తోన్న ఆచారం. ఉన్న కీడంతా తొలగిపోయి.. మంచిరోజులు రావాలని, అందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో భోగి మంటలను వేస్తారు. అదేరోజు, బొమ్మలపేరంటాలను ఏర్పాటు చేసుకుంటారు. ముత్తైదువులనూ పిలిచి పేరంటం చేసి, పండూ తాంబూలం ఇస్తారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే.. వారికి భోగిపండ్లు పోస్తారు. భోగిపండ్లు అంటే రేగుపండ్లు, పూల రేకులు, చిల్లర నాణేలు, చెరుకుముక్కలు కలిపి పిల్లల తలపై పోసి, అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు.


రేగి పళ్లను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. అలాగే పిల్లలపై ఏదైనా చెడు దృష్టి ఉంటే తొలగిపోతుందని నమ్మకం. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. దానిమీదుగా భోగిపండ్లను పోస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని మరికొందరి నమ్మిక. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని పురాణాలు చెప్తున్నాయి. ఆనాటి సంఘటనకు ప్రతీకగా భోగి రోజున పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి.


అందుకే మకర సంక్రాంతి:


సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయాన్ని సంక్రమణం అని పిలుస్తాం. ఇలా సూర్యుడు ఏడాదిలో పన్నెండు రాశులలోనూ సంచరిస్తాడు. అయితే ఆయన ధనూరాశి నుంచి మకరరాశిలోకి అడుగుపెట్టే సమయానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పటివరకూ దక్షిణదిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, తన దిశను మార్చుకుని ఉత్తరదిక్కుగా సంచరిస్తాడు. అందుకనే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుచుకోవడం కద్దు. ఇలా సూర్యుడి గమనం మారడం వల్ల ఇప్పటివరకూ ఉన్న వాతావరణం కూడా పూర్తిగా మారిపోతుంది. సంక్రాంతిని సౌరమానం ప్రకారం చేసుకుంటాం కాబట్టి, ఎప్పుడూ ఈ పండుగ తేదీ పెద్దగా మారదు. సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశి లోకి ప్రవేశిస్తాడు కాబట్టి.. దీనిని మకర సంక్రమణం, మకర సంక్రాంతిగా పిలుస్తారు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి.


కొత్తబియ్యంతో పిండివంటలు:


సంక్రాంతినాడు కొత్త బియ్యంతో పిండివంటలు చేసుకోవడంలో అర్థం, పరమార్థం రెండూ ఉంటాయి. సంక్రాంతినాటికి పొలాల నుంచి వచ్చిన ధాన్యంతో గాదెలే కాదు, రైతుల మనసులు కూడా నిండుగా ఉంటాయి. కానీ.. కొత్తబియ్యంతో ఎవరూ అన్నం వండరు. అప్పుడే పండించిన బియ్యంతో వండిన అన్నం తింటే అజీర్ణం చేస్తుంది. అందుకే.. వాటిని నానబెట్టి, పిండి ఆడించి బెల్లంపాకం పట్టి అరిసెలు వండుతారు. అలాగే పాలుపొంగించి, కొత్తబియ్యంతో పరమాన్నాన్నీ వండుకుంటారు. ఇలా కొత్తబియ్యంతో తయారు చేసిన వంటకాలు తినడం వల్ల అజీర్ణం కూడా చేయదు. అలాగే.. కొత్త బియ్యంతో వండిన పిండివంటలను భగవంతుడికి నైవేద్యంగా అర్పించడం వల్ల, పంట సక్రమంగా చేతికి అందినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత తెలుపుకుంటారు రైతులు.


కనుమ రోజు ఏం చేస్తారు:


నాలుగురోజుల పండుగలో.. కనుమను మూడోరోజు జరుపుకుంటారు. ఈ రోజును పశువుల పండుగగా కూడా పిలుస్తారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చాక రైతన్నలు ఆనందంతో పొంగిపోతారు. అయితే పంట చేతికి రావడంలో కేవలం తమ శ్రమ మాత్రమే లేదని, పశు పక్ష్యాదులు కూడా పంట పండటంలో సహకరించాయని రైతన్నల నమ్మకం. అందుకే కనుమ రోజు పశు, పక్ష్యాదులకు ఆహారం వేస్తారు. గోవులకు పసుపు, కుంకుమలు పెట్టి పూజిస్తారు. వాటికిష్టమైన ఆహారాన్ని పెట్టి.. వాటిని సంతోషపరుస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. కనుమ నుంచి రథసప్తమి వరకూ.. వాకిలిలో రకరకాల డిజైన్లతో రథం ముగ్గులు వేస్తారు.


ముక్కనుమ విశేషం:


ఈ సంక్రాంతి పండుగలో నాల్గవరోజును ముక్కనుమ అంటారు. ముక్కనుమ నాడు సాధారణంగా మాంసాహార ప్రియులు తాము ఇష్టపడే వివిధ మాంసాహార వంటకాలను వండుకుని కుటుంబ, బంధు, మిత్రులతో కలిసి తిని ఆనందిస్తారు. పండుగలోని మొదటి మూడు రోజులు కేవలం శాఖాహారమే భుజించాలి. ఇది శాస్త్రీయమైన సాంప్రదాయం, ఆరోగ్యసూత్రం. మాంసాహారం తినకూడదు. ప్రకృతిలోని మార్పు వలన సప్త ధాతువుల మిళితమైన మానవ శరీరంలో కూడా మార్పు చోటు చేసుకుంటుంది. అది మానవ శరీరానికి హాని చేయకుండా ఉండేందుకే ఎక్కువ నువ్వులతో ముడిపడిన పిండి వంటకాలను ఏర్పాటు చేసారు.


ఇదీ నాలుగురోజుల సంక్రాంతి. ఆటపాటల, రంగు రంగుల రంగవల్లుల సంక్రాంతి. నాలుగు రోజుల పాటు జరుపుకునే పండుగ కాబట్టి.. ఇది పెద్ద పండుగ అయింది. పెద్దలకు తర్పణమిస్తారు కనుక పెద్దల పండుగ కూడా అయింది.

Latest News

 
రెండు దొంగ ఓట్లు వేసైనా గెలిపించండి.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్ Sat, Apr 20, 2024, 07:47 PM
చంద్రబాబును అందరూ మర్చిపోయినా, నేను మర్చిపోను: సింగర్ స్మిత Sat, Apr 20, 2024, 07:36 PM
తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు.. బంగారం ఎన్నివేల కేజీలంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏకంగా వేల కోట్లలో Sat, Apr 20, 2024, 07:31 PM
ఏపీలో బీఆర్ఎస్ పోటీ..? బీఫామ్ కోసం కేసీఆర్ వద్దకు లీడర్ Sat, Apr 20, 2024, 07:25 PM
అన్న దగ్గర కోట్లలో బాకీపడిన షర్మిల.. వదిన వద్ద కూడా అప్పులు..ఎంత ఆస్తి ఉందంటే Sat, Apr 20, 2024, 07:20 PM