సంక్రాంతి కోడిపందేలకు కాలుదువ్వుతున్న పుంజులు?
 

by Suryaa Desk |

సంక్రాంతి అంటే కోడి పందేలు..కోడి పందేలు అంటే తూర్పుగోదావరి.. ఇప్పుడు పండగ దగ్గరపడడంతో జిల్లాలో పందెంరాయుళ్లు పుంజులను అమ్మకాలకు భారీగా సిద్ధం చేశారు. బరిలో గెలిచి నిలిచే వాటిని దిట్టంగా మేపుతున్నారు. మేపడం అంటే ఇదేదో అల్లాటప్పా కాదండోయ్‌...మటన్‌.. జీడిపప్పు.. బాదం పప్పు.. పిస్తా.. కిస్‌మిస్‌.. ఇలా ఒకటేంటీ అన్ని రకాల బలవర్థకమైన ఆహారం ఇచ్చి పందేల కోసం పోషిస్తున్నారు. కోనసీమ లో పలువురు వైసీపీ ప్రజాప్రతినిథులే ఏకంగా తమ ఫాంహౌస్‌ల్లో పదుల సంఖ్యలో జాతి పుంజులను పోటీలకు తయారు చేశారు.


కోనసీమలో ఇదే తరహాలో పుంజులకు ప్రస్తుతం ముమ్మరంగా శిక్షణ జరుగుతోంది. ఒకపక్క పోలీసులు పందేలు వద్దంటున్నా తమ జోలికైతే రారనే ధీమాతో పలువురు నేతలు తమ తోటల్లో పుంజుల క్రయవిక్రయాలు లక్షల్లో చేస్తున్నారు. పెంచుతున్న పుంజుల మధ్య పోటీ పెట్టి గెలిచిన వాటిని పందేల కోసం రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మరికొందరు సొంతంగా పందేలు కట్టడం కోసమే పెంచుతున్నారు.


సంక్రాంతి పండగ సమీపించడంతో జిల్లాలో పలువురు పందెంరాయుళ్లు పుంజులను పోటీలకు సిద్ధం చేసి సై అంటున్నారు. గడచిన ఆరు నెలలుగా ఫాంహౌస్‌ల్లో పెంచుతున్న పుంజులకు గడచిన కొన్ని రోజులుగా శిక్షణ ఇచ్చి ఇప్పుడు వీటిని లక్షలకు విక్రయిస్తూ భారీగా అర్జిస్తున్నారు. దీంతో జిల్లాలో పలుచోట్ల పుంజుల వ్యాపారం కోట్లలో జరుగుతోంది. కోనసీమ లో వందలాది జాతి పుంజులను అమ్మకానికి ఉంచడంతో‌ పశ్చిమగోదావరితోపాటు జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ఇక్కడకొచ్చి లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.


జాతి రకాన్ని బట్టి పుంజును రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నారు. వీటికి ఇంత ధర ఎందుకని ప్రశ్నిస్తే ఆరు నెలలుగా వీటికి శిక్షణ ఇచ్చి ప్రతి పదిహేను రోజులకు పెంచుతున్న పుంజుల మధ్య పోటీపెట్టామని, వాటిలో ప్రతిసారీ నెగ్గుకొస్తున్న పుంజులకు ఆ మాత్రం ధర తప్పదంటూ సమాధానం ఇస్తున్నారు. అయినా ధర ఎక్కువైనా పలువురు పందెంరాయళ్లు ఎగబడి కొంటుండడం విశేషం. ఇలా ప్రత్తిపాడు, సామర్లకోట, పెద్దాపురం,తుని, ఏలేశ్వరం, కోనసీమలోని పలు మండలాల్లో కొబ్బరి తోటల్లో ఎక్కువగా అధికార పార్టీ నేతలు, ఆ పార్టీకి చెందిన పలువురు సర్పంచ్‌లు, వారితో అను బంధం ఉన్న పలువురు పందెంరాయుళ్లు జోరుగా పందెం పుంజులను ఫాం హౌస్‌ల్లో విక్రయిస్తున్నారు.


పలుచోట్ల పుంజుల విక్రయాలు పండగ దగ్గరపడడంతో పుంజుకున్నాయి. కొందరైతే అధిక డబ్బుల కోసం రిహార్సల్స్‌ చూపించి విక్రయాలు జరుపుతున్నారు. ఎక్కువగా పందేలకు డేగ, నెమలికాకి, అబ్రాస్‌, సేతు, పర్లసవల, మైల, కొక్కిరాయి, రసంగి, ఎరుపుకళ్ల నెమలి జాతి పుంజులకే డిమాండ్‌ ఉండడంతో వీటినే ఇక్కడ అమ్ముతున్నారు. పందేల కోసం గడచిన కొన్ని నెలలుగా ఒక్కో పుంజుకు రోజుకు 50 గ్రాముల మటన్‌ తినిపిస్తున్నారు. మధ్యాహ్నం పది హేను రకాల ఎండు ఫలాలతోకూడిన ఉండలు తయారుచేసి అందిస్తున్నారు.


వీటిద్వారా లాభాలు ఆర్జించడం కోసం పెంపకం ఎలా చేశామనేది సదరు అమ్మకందార్లు వీడియోలు తీసి పందెంరాయుళ్లకు చూపించి మరీ విక్రయిస్తున్నారు. ఏడాదిన్నర నుంచి రెండేళ్లలోపు ఉన్న జాతి పుంజులకు డిమాండ్‌ అధికంగా ఉందని విక్రయదారులు వివరించారు. పందేలకు వెళ్లే పుంజు శరీరం గట్టిగా ఉంటేనే పోటీలో ఎక్కువ సేపు ఉంటుంది. అందుకోసం వీటికి ఈత కూడా నేర్పారు. వేడి సారాలో వస్త్రాన్ని ముంచి దాంతో శరీరాన్ని ఒత్తుతామని తద్వారా ఎక్కువసేపు పోరాడుతుందని పేర్కొన్నారు. సంక్రాంతి పందేల కోసమని ఇప్పటివరకు ఒక్కో పుంజుకు రోజుకు రూ.300 వరకు ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు. దీంతో వీటికి ఎక్కువ గిరాకీ పలుకుతోందని మలికిపురం మండలం గుడిమెళ్లంక గ్రామానికి చెంది గిరి తెలిపాడు.

Latest News
ఏపీ నిరుద్యోగుల‌కు మ‌రో అవ‌కాశం Sat, Jan 29, 2022, 02:42 PM
వైసీపీ ప్రభుత్వంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు, దాడులు: గుంటుపల్లి శ్రీదేవి చౌదరి Sat, Jan 29, 2022, 02:27 PM
తూర్పగోదావరి జిల్లాలో దారుణం.. భర్త విసిగిస్తున్నాడని మర్మాంగం కట్ చేసి హతమార్చింది Sat, Jan 29, 2022, 02:17 PM
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి Sat, Jan 29, 2022, 02:03 PM
కులం పేరుతో దూషిస్తున్నాడని భర్త పై భార్య ఫిర్యాదు Sat, Jan 29, 2022, 01:51 PM