బద్వేలు ఓటర్లకు సీఎం జగన్ లేఖలు.. మీ ఇంటికీ వద్దామనుకున్నా..కానీ..!

by సూర్య | Mon, Oct 25, 2021, 03:56 PM

ఉప ఎన్నిక జరగనున్న బద్వేలు ఓటర్లకు ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాసారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేలులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ..జనసేన పోటీ చేయటం లేదు. ఇక, ఈ నెల 28వ తేదీతో ప్రచారం ముగియనుంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్ది దాసరి సుధ కు మద్దతుగా ముఖ్యమంత్రి జగన్ మంత్రులు..పార్టీ ఎమ్మెల్యేలకు గెలుపు బాధ్యతలు అప్పగించారు. మంత్రి పెద్దిరెడ్డిని ఇన్ ఛార్జ్ గా నియమించారు.


నియోజకవర్గ పరిధిలోని మండలాల బాధ్యతలను ఎమ్మెల్యే లకు కేటాయించారు. బీజేపీ అభ్యర్ధికి జనసేన మద్దతిస్తుందని చెప్పినా... జనసేన అధినేత పవన్ మాత్రం ప్రచారంలో పాల్గొనే అవకాశాలు లేనట్లే. మరో మూడు రోజుల మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కమలమ్మకు మద్దతు ఇస్తున్నట్లుగా సీపీఐ ప్రకటించింది. బీజేపీ నేతలు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కావటంతో ప్రతిపక్షాలు తమ సత్తా చాటుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.


ప్రతీ ఓటరుకు ముఖ్యమంత్రి లేఖలు..  ఇక, నియోజకవర్గ పరిధిలో బహిరంగ సభలో పాల్గొనాలని సీఎం జగన్ భావించినా.. భారీ బహిరంగ సభలకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వటం లేదు. కోవిడ్ ప్రోటోకాల్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని నిర్దేశించింది. దీంతో..తిరుపతి ఎన్నికల తరహాలోనే ముఖ్యమంత్రి జగన్ బద్వేలు ఓటర్లకు సైతం లేఖలు రాసారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతీ ఇంటిలోని..కుటుంబ సభ్యుని పేరు ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి లేఖలు పార్టీ నేతలు గడప గడపకు అందచేస్తున్నారు. అందులో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు... నవరత్నాల గురించి సీఎం వివరించారు.


ఆ లేఖలో మా కుటుంబ సభ్యులతో కలిసి గడిపి.. బహిరంగ సభ ద్వారా ఓట్లు అడగాలని భావించానని సీఎం చెప్పుకొచ్చారు. బద్వేలుకు తాను వస్తే..భారీగా అక్కా - చెల్లెమ్మలు ఒక్క సారిగా గుమి గూడితే వారిలో ఏ కొందరికైనా కోవిడ్ సోకే ప్రమాదం ఉందని సీఎం పేర్కొన్నారు. వారి కుటుంబాల ఆరోగ్య పరిస్థితుల కారణంగా .. తాను రాలేకపోతున్నట్లుగా సీఎం తన లేఖలో వివరించారు. బద్వేలు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్ది దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి జగన్ లేఖ ద్వారా కోరారు. 


ప్రచారం ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో పార్టీకి చెందిన మంత్రులు..ఎమ్మెల్యేలు బద్వేలు పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. అదే విధంగా బీజేపీ..కాంగ్రెస్ నేతలు సైతం ప్రచారం తీవ్రం చేసారు. బీజేపీ ఏపీ ముఖ్య నేతలు బద్వేలులోనే మకాం వేసారు. అయితే, టీడీపీ ఈ ఎన్నికల్లో బరిలో లేకపోవటంతో..ఆ పార్టీ ఓట్లను తమ వైపుకు మళ్లించుకొనేందుకు కాంగ్రెస్.. బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్... మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు. వచ్చే నెల 2వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Latest News

 
బైకులు ఎత్తుకెళ్తున్న దొంగలు అరెస్టు Fri, Mar 29, 2024, 01:41 PM
42 ఏళ్లుగా ప్రజా సేవలో టిడిపి: ఎమ్మెల్యే ఏలూరి Fri, Mar 29, 2024, 01:39 PM
ఎన్నికల నిబంధనలకు తిలోధకాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? Fri, Mar 29, 2024, 01:38 PM
టీడీపీ లో చేరిన ప్రముఖ వైద్యులు రామయ్య నాయుడు Fri, Mar 29, 2024, 01:36 PM
వివేక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలి Fri, Mar 29, 2024, 01:36 PM