టిడిపి ఫిర్యాదుతో రాష్ట్రపతి సీరియస్.. జగన్ పై యాక్షన్ ఉండనుందా.?

by సూర్య | Mon, Oct 25, 2021, 02:48 PM

ఏమిటీ శారీరక, మానసిక, ఆర్థిక దాడి?ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం పేట్రేగిపోతున్నదని, పోలీసులను ఇష్టారీతిగా వాడుతోన్న జగన్ సర్కారు.. ప్రతిపక్ష నేతలపై శారీరక, మానసిక, ఆర్థికపరమైన దాడులకు తెగబడుతోందని టీడీపీ నేత చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో ఆర్టికల్ 356 విధిస్తేగానీ పరిస్థితులు దారికి రాబోవని, ఆ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు విజ్ఞప్తి చేశామన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం నాడు ఢిల్లీకి వచ్చిన ఆయన.. జగన్ సర్కారు అతివాద చర్యలపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు. ఐదుగురు కీలక నేతల బృందంతో కలిసి కోవింద్ ను కలిసొచ్చిన తర్వాత రాజ్ భవన్ వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తమ ఫిర్యాదులపై రాష్ట్రపతి స్పందించిన తీరు, జగన్ ను అడ్డుకోకపోతే దేశ భవిష్యత్తు ఎలా నాశనం కాబోతోందో చంద్రబాబు వివరించారు..


ఏపీలో జరుగుతోన్న పరిణామాలను రాష్ట్రపతికి పూసగుచ్చినట్లు వివరించామని, ఏ చిన్న విషయాన్నీ వదిలిపెట్టకుండా జగన్ ఉగ్రచర్యలపై తయారు చేసిన పుస్తకాన్ని కూడా అందించామని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. పోలీసుల అండతో ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం కొనసాగుతున్నదని, రాజకీయ పోరాటాలకు తావు లేని విధంగా పరిస్థితులు దిగజారాయని, ప్రతిపక్షం గొంతుకనే కాకుండా ప్రజల ప్రాథమిక హక్కులను సైతం జగన్ సర్కారు హరించివేస్తోన్న తీరును రాష్టపతికి తెలిపామన్నారు.


'చరిత్రలో ఎన్నడూ చూడని దుష్ట సంప్రదాయానికి జగన్ తెరలేపాడు. ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నాడు. మమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్నాడు. మా ఆర్థిక మూలాలపైనా దెబ్బ కొడుతున్నాడు. గతంలో పులివెందులలో రాజారెడ్డి కూడా ఇలాగే చేసేవాడట. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను నరికేస్తే ఇక వారు మాట్లాడకుండా ఉంటారన్నది వైఎస్ కుటుంబ విధానం. అయితే, మేం వీటికి బెదిరిపోము. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికే నేను ఇవాళ ఢిల్లీకి వచ్చాను..


ఏపీలో ప్రభుత్వమే ఉగ్రచర్యలకు పాల్పడుతోందనడానికి అన్ని రకాల ఆధారాలను రాష్ట్రపతికి సమర్పించాం. వెంటనే ఏపీలో ఆర్టికల్ 356ని అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేశాం. జగన్ ను తక్షణమే అడ్డుకోకపోతే ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదమనే ఆయన మేనియా ఇతర రాష్ట్రాలకూ వ్యాపిస్తుంది. అప్పుడు దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. పరిస్థితి ఆ స్థాయికి దిగజారకుండా ఉండాలంటే తక్షణమే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోవింద్ గారిని కోరాం..'అని చంద్రబాబు తెలిపారు.


40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న టీడీపీకే ఇలాంటి పరిస్థితి తలెత్తితే, ఏపీలో సామాన్యుల పరిస్థితి ఇంకెంత భయానకంగా ఉంటుందో ఊహించుకోవచ్చని చంద్రబాబు అన్నారు. కాగా, జగన్ సర్కారుపై తాము ఇచ్చిన ఫిర్యాదులపై రాష్ట్రపతి స్పందించిన వైనాన్ని కూడా చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ చెప్పిన మాటలు విన్న తర్వాత.. ఇవన్నీ చాలా సీరియస్ అంశాల్లాగా ఉన్నాయి కదాని రాష్ట్రపతి వాపోయారని, తన వైపు నుంచి తప్పకుండా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని రాష్ట్రపతి అన్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ సంతృప్తికరంగా సాగిందని, ఇక ఢిల్లీ నుంచి జగన్ పై యాక్షన్ ఉండొచ్చని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM