నేటి నుంచి వ్యాక్సినేషన్‌

by సూర్య | Sat, Jan 16, 2021, 10:34 AM

 కరోనా పై పోరులో నేడు కీలక ఘట్టానికి తెరలేవనుంది. వ్యాక్సినేషన్‌ (టీకా వేసే) కార్యక్రమం ప్రారంభం కానుంది. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశరాజధానిలో వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలిరోజు దేశ వ్యాప్తంగా 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకి 100 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం నిర్ధేశించింది. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఆరోగ్యకార్యకర్తలు, ఐసిడిఎస్‌ సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. మొదటిరోజు దేశ వ్యాప్తంగా 3006 కేంద్రాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. క్రమేణా ఈ కేంద్రాల సంఖ్యను పెంచనున్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 1075 టోల్‌ఫ్రీ నెంబర్‌తో కాల్‌సెంటర్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


ఎపిలో తొలిరోజు 332 కేంద్రాల్లో....


ఆంధ్రప్రదేశ్‌లోనూ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. తొలిరోజు రాష్ట్రంలో 332 కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. క్రమంగా వీటిని 1940 కేంద్రాలకు పెంచనున్నారు. ఉదయం 11 గంటల తరువాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. హెల్త్‌వర్కర్లతో పాటు పోలీసులు, మున్సిపల్‌, రెవెన్యూ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 4.7 లక్షల కోవిషీల్డ్‌ డోసులు, 20 వేల కోవాగ్జిన్‌ డోసులు వచ్చాయి. వీటిని ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కోసం 3,87,983 మంది నమోదు చేసుకున్నారు. వారికందరికీ వ్యాక్సిన్‌ తొలిడోసు ఇవ్వనున్నారు. ప్రతి కేంద్రంలోనూ ఆరుగురు సిబ్బందికితో బృందాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రానికే వ్యాక్సిన్లు ఆయా కేంద్రాలకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెబ్‌సైట్లో నమోదు చేసుకున్న వారికి ఎవరెక్కడకు వెళ్లాలనే సమాచారాన్ని మెసేజ్‌ రూపంలో పంపించింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారు ఆ తరువాత అర గంటవరకు వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్దే ఉండేలా చర్యలు తీసుకున్నారు.


తెలంగాణలో తొలి టీకా మంత్రి ఈటలకు


తెలంగాణలో తొలి వ్యాక్సిన్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తీసుకోనున్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరక్టర్‌ కె. రమేష్‌రెడ్డితో కలిసి గాంధీ జనరల్‌ ఆస్పత్రిలో ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే వ్యాక్సిన్‌ తీసుకుంటారు. వైద్యారోగ్యశాఖకు తాను కెప్టెన్‌ అనీ, అందుకే ప్రజల్లో భయం పోగొట్టడానికే తొలి టీకా వేసుకుంటున్నట్టు ఈటల రాజేందర్‌ శుక్రవారం మీడియాకు తెలిపారు. తెలంగాణలో తొలిరోజు 139 కేంద్రాల్లో కేంద్రానికి 30 మందికి చొప్పున వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. రెగ్యులర్‌ వ్యాక్సినేషన్‌ కోసం 1213 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Latest News

 
కర్ణాటక మద్యం పట్టివేత Fri, Mar 29, 2024, 10:31 AM
3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన Fri, Mar 29, 2024, 10:00 AM
మూడో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర Fri, Mar 29, 2024, 09:37 AM
తిరుమలలో భక్తుల రద్దీ Fri, Mar 29, 2024, 09:27 AM
చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు Fri, Mar 29, 2024, 09:13 AM