తెలుగు రాష్ట్రాల్లో 'భోగి' సందడి

by సూర్య | Wed, Jan 13, 2021, 11:07 AM

 తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్య, వృత్తి నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లిన వారంతా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు చేరుకున్నారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. తెలుగు వారి పెద్ద పండుగలో మొదటిదైన భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే చిన్నా పెద్ద అంతా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. గంగిరెద్దులు, హరిదాసులు, మేలాల నడుమ రంగవళ్లులపై గొబ్బెమ్మలు ఉంచి బోగి మంటలు వేశారు. వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసి సందడి చేశారు.


 


తిరుమలలో భోగి వేడుకలు


సంక్రమణ మహాపర్వానికి ముందురోజు చేసుకునే భోగి పండుగను ఆధ్యాత్మిక నగరి తిరుమలలో ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. శ్రీవారి ఆలయం మహాద్వారం ముందు వేకువజామున భోగి మంటలు వేశారు. శ్రీవారి సేవకులు, భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి ధనుర్మాస కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు.


 


ఇంద్రకీలాద్రిపై..


విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సంక్రాంతి పండుగ సంబరాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాదశర్మ, వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు దంపతులు మంత్రోచ్ఛరణల మధ్య భోగి మంటలను ప్రజ్వలింపజేశారు. అనంతరం భోగి చుట్టూ పదక్షిణలు చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. మహామండపం పెద్ద రాజగోపురం ఎదురుగా బొమ్మలకొలువు ఏర్పాటు చేశారు. భోగి సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు భోగి మంటలు, బొమ్మలకొలువును చూసి ఆనందించారు. సాయంత్రం బొమ్మలకొలువు వద్ద ఏర్పాటు చేసిన ఉత్సవ మూర్తుల వద్ద చిన్నపిల్లలకు భోగి పళ్లు పోస్తామని ఈవో సురేశ్‌ బాబు తెలిపారు.


 


తీపి గురుతులో ఆహ్వానం పలుకుదాం..


కరోనా చేదు జ్ఞాపకాలను భోగిమంటల్లో వేసి.. తీపి గురుతులతో సంక్రాంతికి ఆహ్వానం పలుకుదామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రజలకు పిలుపునిచ్చారు. కుటుంబసభ్యులతో కలిసి విజయవాడలో భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితంపై ప్రభావం చూపిన కరోనాతో పాటు, మనిషిలోని చెడును తగలబెట్టి మనచుట్టూ మంచిని విస్మరించడమే ఈ భోగి మంటల అంతరార్థంగా మంత్రి పేర్కొన్నారు. పాడిపంటలు చేతికొచ్చే సమయంలో చేసుకునే సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.


 


అమరావతిలో భోగి వేడుకలు


రాజధాని గ్రామాల్లో రైతులు బోగి వేడుకలను నిర్వహించారు. ''నేటి భోగి మంటలు కారాదు అమరావతి చితిమంటలు'' పేరుతో భోగి మంటల కార్యక్రమం చేపట్టారు. తుళ్లూరులో నిర్వహించిన భోగి వేడుకల్లో గుంటూరు పార్లమెంట్‌ తెలుగుదేశం పార్టీ నియోజవకర్గ బాధ్యులు తెనాలి శ్రావణ్‌ కుమార్‌, రాజధాని ఐక్యకార్యాచరన సమితి నేతలు పాల్గొన్నారు. అమరావతికి వ్యతిరేకంగా రూపొందించిన చట్టాల ప్రతులను భోగిమంటల్లో వేశారు. భోగి మంటల చుట్టు మహిళలు జానపదాలు పాడుతూ నిరసన తెలిపారు. వెలగపూడిలో హరిదాసులతో కలిసి రైతులు భోగి మంటలు వేశారు. వెంకటపాలెం, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, కృష్ణాయపాలెంలో రైతులు భోగి వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM