సీనియర్ జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబ రావు కన్నుమూత

by సూర్య | Mon, Jan 11, 2021, 10:25 AM

ప్రముఖ జర్నలిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత తుర్లపాటి కుటుంబ రావు కన్ను మూశారు. అదివారం రాత్రి 10 గంటల సమయంలో అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తుర్లపాటి మరణ వార్త తెలిసిన వెంటనే జర్నలిస్టులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన తుర్లపాటి కుటుంబరావు 1933 ఆగస్టు 10న సుందర రామానుజరావు, శేషమాంబ దంపతులకు జన్మించారు. 1946లో అంటే తన 14వ ఏటనే ఆయన పాత్రికేయ వృత్తిలో అడుగుపెట్టారు. ఆంధ్రరాష్ట్రం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం వద్ద సెక్రటిరీగా పనిచేశారు. ఏడు దశాబ్దాల పాటు జర్నలిజంలో ఉన్న ఆయన అనేక కీలక అంశాలపై విశ్లేషణలు అందించారు. జర్నలిస్టుగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభ అధ్యక్షుడిగా, అనువాద ప్రసంగికునిగా తుర్లపాటి కుటుంబరావు ఎనలేని కీర్తిగడించారు.


ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నుంచి మొదలు కొని నారా చంద్రబాబు నాయుడు వరకు 18 మంది సీఎంలతో ఆయన పనిచేశారు. అలాగే ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి ఎంపికై తొలి తెలుగు జర్నలిస్టు తుర్లపాటి. జర్నలిస్టుగా, రచయితగా, వక్తగా ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్రం ప్రభుత్వం 2002లో ప్రతిష్టాత్మక పద్మశ్రీతో సత్కరించింది. ఆచార్య ఎన్జీ రంగా ప్రారంభించిన వాహిని పత్రికలో 1951లో తొలిసారిగా ఉపసంపాదకుడిగా తుర్లపాటి పనిచేశారు. ఆ తర్వాత ప్రతిభ పత్రికకు ఎడిటర్ గా పనిచేశారు. ఆయన ప్రతిభ గురించి తెలుసుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు.. చెన్నైకి పిలిపించి ప్రజాపత్రికలో సహాయ సంపాదకుడిగా నిమించారు. ఆ పత్రికలో పనిచేస్తూనే ప్రకాశం పంతులుకు కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. ప్రకాశం పంతులు సీఎం అయిన తర్వాత తన దగ్గరే పనిచేయాలని కోరగా.., ప్రభుత్వంలో ఉండి నిజాలు రాయలేనని తిరస్కరించారు.తుర్లపాటి తన జర్నలిజం కెరీర్ లో ఎన్నో ఉన్నతశిఖరాలు అధిరోహించారు. నెహ్రూ, అంబేద్కర్, రాజాజీ లాంటి మహామహులను ఇంటర్వీ చేశారు. అలాగే 14 ఏళ్ల వయసులోనే మహాత్మా గాంధీ విజయవాడ వచ్చిన సమయంలో ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ ప్రముఖులు, జాతీయ వాదుల జీవితాలపై పరిశోధనలు చేసి వారి జీవితచరిత్రలు రాశారు. ఇక మన రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో నిర్వహించిన ముఖ్యమైన సమావేశాల్లో ప్రసంగించిన ఘనత తుర్లపాటికి దక్కుతుంది. జాతి నిర్మాతలు, మహానాయకులు, జాతక కథలు, విప్లవ వీరులు, నా కలం నా గళం, 18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు పేరుతో పుస్తకాలు చేశారు.


 


ఎన్నో పురస్కారాలు


పాత్రికేయ రంగంలో భీష్ముడిగా ఖ్యాతిగడించిన తుర్లపాటి కుటుంబరావు తన కెరీర్ లో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించారు. అలాగే ఎన్నో పురస్కారాలు ఆయన్ను వరించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్‌గా పనిచేశారు. అలాగే ఆంధ్రా విశ్వకళా పరిషత్ అయన్ను కళాప్రపూర్ణ బిరుదుతో సత్రచించింది. 1969లో నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కమిటీలో సభ్యునిగా, నేషనల్‌ ఫిల్మ్‌ అడ్వైజరీ కమిటీల, సెంట్రల్‌ ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డులో సభ్యుడిగా పనిచేశారు. 1990లో ఉత్తమ బయోపిక్ రైటర్ గా తెలుగు యూనివర్సీ నుంచి అందుకున్నారు. ఉపన్యాస కేసరి బిరుదు కూడా తుర్లపాటిని వరించింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు. 1994లో కాశీనాథుని నాగేశ్వరరావు నుంచి ఉత్తమ జర్నలిస్టు అవార్డ్, 1993లో గిన్నిస్‌ బుక్‌ అవార్డు, 1998లో అమెరికా నుంచి వరల్డ్‌ లైఫ్‌ టైం అచీవ్‌ మెంట్‌ అవార్డును అందుకున్నారు.


 


తుర్లపాటి కుటుంబరావు మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ మంత్రులు ఆళ్ల నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తుర్లపాటి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM